నీ రక్తం కళ్లజూస్తా.. నీ రక్తం తాగుతా.. అంటూ ఆవేశంగా చెప్పే డైలాగ్స్ వినే ఉంటాం. కానీ ఇక్కడో వ్యక్తి అన్నంత పని చేశాడు. ఓ వ్యక్తి గొంతు కోసి, అతడి రక్తాన్ని తాగాడు. కర్నాటకలో జరిగింది ఈ దారుణ ఘటన.
కర్నాటకలోని చింతామణికి చెందిన విజయ్, చేలూరుకు చెందిన మారేష్ వ్యాపార భాగస్వాములు. ఇద్దరూ కలిసి చింతామణి పట్టణంలో వస్త్రాలు, గాజులు అమ్ముతుంటారు. అయితే మారేష్ పై విజయ్ కు అనుమానం వచ్చింది. ఆ అనుమానం వ్యాపారానికి సంబంధించినది కాదు.
తన భార్యతో మారేష్, అక్రమ సంబంధం పెట్టుకున్నాడనేది విజయ్ అనుమానం. తన మార్గాల్లో తను నిజనిర్థారణ చేసుకున్నాడు. దీంతో మరో ఫ్రెండ్ జాన్ బాబుతో కలిసి కుట్రపన్నాడు. మారేష్ ను సిద్ధాపుర క్రాస్ రోడ్స్ కు రమ్మని పిలిచాడు.
పిలిచింది బిజినెస్ పార్టనర్ కావడంతో మారేష్ ఏమాత్రం సందేహించకుండా వెళ్లాడు. క్రాస్ రోడ్స్ కు వెళ్లిన వెంటనే, తన భార్యతో పెట్టుకున్న అక్రమ సంబంధంపై మారేష్ ను ప్రశ్నించాడు విజయ్.
ఆ వెంటనే తనతో తెచ్చుకున్న బ్లేడ్ తో మారేష్ గొంతు కోశాడు. అతడిపై పిడి గుద్దులు కురిపించాడు. దీంతో మారేష్ కిందపడిపోయాడు. ఆ వెంటనే విజయ్, మారేష్ గొంతు దగ్గర తన నోరు పెట్టి, బయటకొచ్చిన రక్తాన్ని తాగాడు.
ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కనే ఉన్న జాన్ బాబు షూట్ చేశాడు. ఈనెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో, అటుఇటు చేతులు మారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. రక్తం తాగుతున్న విజయ్ ను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
అయితే ఈ ప్రమాదం నుంచి మారేష్ బయటికి బయటపడ్డాడు. గాయం మరీ పెద్దది కాకపోవడంతో, వెంటనే వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. 4 రోజుల పాటు ట్రీట్ మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత తీరిగ్గా విజయ్ పై కేసు పెట్టాడు.