వ‌కీల్‌సాబ్‌కు ప‌రీక్షా స‌మ‌యం!

కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు ఊ కొట్ట‌డ‌మా లేక ఊహూ అని వ్య‌తిరేకించ‌డ‌మా? ఈ రెండు ఆప్ష‌న్లు జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎదుట ఉన్నాయి. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో బీజేపీపై ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌రోక్షంగా…

కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌కు ఊ కొట్ట‌డ‌మా లేక ఊహూ అని వ్య‌తిరేకించ‌డ‌మా? ఈ రెండు ఆప్ష‌న్లు జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎదుట ఉన్నాయి. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో బీజేపీపై ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప‌రోక్షంగా మోదీ స‌ర్కార్‌ను హెచ్చ‌రించారు. అయితే బీజేపీతో పొత్తులో ఉన్న ప‌వ‌న్‌కు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై నిర్ణ‌యించుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణ చేసే క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో దుందుడుకు చ‌ర్య చేప‌ట్టింది.

2020 మార్చిలో కేటాయించిన తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని ర‌బోది బొగ్గు గ‌నిని ర‌ద్దు చేసి, వేలం ద్వారా వేరే కంపెనీకి అప్ప గించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆర్థికంగా మ‌రింత నిర్వీర్యం చేసే ప‌నిగా కార్మికులు వాపోతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ తాజా చ‌ర్య వ‌ల్ల‌ స్టీల్‌ప్లాంట్ బొగ్గును బ‌హిరంగ మార్కెట్‌లో కొనాల్సిన దుస్థితి క‌లిగింది. ఇటీవ‌ల‌ బొగ్గు ధ‌ర అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ట‌న్ను 130 డాల‌ర్ల నుంచి 630 డాల‌ర్ల‌కు చేరింది. దీంతో స్టీల్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ట‌న్ను రూ.80 వేల పైమాటే. ఇలాగైతే విశాఖ స్టీల్ ప్లాంట్ మ‌నుగడ ఎలా సాగిస్తుంద‌నే ఆవేద‌న కార్మికులు వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. పార్టీ కార్య‌క‌ర్త‌ల విస్తృత‌స్థాయి స‌మావేశంలో ఆయ‌న ఏమ‌న్నారంటే… ‘32 మంది బలిదానాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వచ్చింది. విభజన సమయంలో ఎంపీలెవరూ విశాఖ స్టీల్‌కు సొంత గనులు ఇవ్వాలని కోరలేదు. దాని ఫలితమే… ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ. దీన్ని జనసేన వ్యతిరేకిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని, సొంత గనులు కేటాయిస్తుందనే నమ్మకం ఉంది. ప్రైవేటీకరణపై ముందుకెళితే, ఎలా ఆపాలో ప్రణాళిక రచిస్తాం. పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలి. పొత్తులో ఉన్నంత మాత్రాన అన్నింటికీ ఊ కొడతామని కాదు. 70 శాతం అంశాలపై ఏకీభవించవచ్చు. 30 శాతం అంశాలపై విభేదాలు ఉంటే… వాటిపై మాట్లాడతాం’ అని తేల్చి చెప్పారు.  

విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంట్‌ను  ప్రైవేట్‌ప‌రం చేసే క్ర‌మంలోనే లైమ్‌స్టోన్‌ను అందించే ఒడిసాలోని నీలాంచ‌ల్ స్టీల్‌ను త‌ప్పించింది. అలాగే ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రం జిల్లా సారిప‌ల్లెలో స్టీల్‌ప్లాంట్‌కు ఎప్పుడో కేటాయించిన ఇసుక మైనింగ్ వెన‌క్కి తీసుకుంటామ‌ని సంబంధిత‌ శాఖ నుంచి నోటీసులు ఇప్పించింది. ఇప్పుడు బొగ్గుగ‌ని ర‌ద్దు… ఇలా ఒక్కొక్క‌టిగా ర‌ద్దు చేస్తూ, చివ‌రికి ప్రైవేట్‌ప‌రం ఒక్క‌టే మిగిలి ఉంద‌ని కేంద్రం త‌న చ‌ర్య‌ల ద్వారా చాటి చెబుతోంది. 

మ‌రి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపేందుకు ప్ర‌ణాళిక ర‌చిస్తాన‌ని చెబుతున్న ఏం చేయ‌బోతున్నారు? అలాగే పొత్తులో ఉన్నంత మాత్రాన అన్నిటికి ఊ కొడ‌తానా? అని ప్ర‌శ్నిస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌… కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమిత‌మా? చ‌ర్య‌లేమైనా ఉన్నాయా? అని తేల్చుకునేందుకు ఇంత కంటే మంచి స‌మ‌యం మ‌రొక‌టి రాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.