మహేష్ నటిస్తున్న తాజా చిత్రం సర్కారువారి పాట సినిమా విడుదలపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఓసారి వాయిదాపడిన ఈ సినిమా, మరోసారి పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. స్వయంగా యూనిట్ నుంచే ఇలాంటి ఫీలర్లు వస్తున్నాయి. ఇంతకుముందు ప్రకటించినట్టుగా మే 12కు సర్కారువారి పాట రాకపోవచ్చనేది ఆ ఫీలర్ సారాంశం. మరో వారం, పది రోజుల్లో కొత్త రిలీజ్ డేట్ తో, కొత్త పోస్టర్ వచ్చే అవకాశం ఉందంట.
సర్కారువారి పాట సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికి షూటింగ్ పూర్తికాలేదు. పైగా ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దీంతో సర్కారువారి పాట సినిమాను సంక్రాంతి నుంచి సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. అ తర్వాత ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడింది, అది వేరే సంగతి.
అలా సమ్మర్ కు వచ్చిన సర్కారువారి పాట సినిమాను మే 12న విడుదల చేస్తామంటూ ఆమధ్య అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడా డెడ్ లైన్ ను అందుకోవడం మేకర్స్ కు కష్టంగా మారిందంట. సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో పాటు.. కొన్ని రీషూట్స్ కూడా ఉన్నాయనేది ఇంటర్నల్ టాక్.
దీంతో సర్కారువారి పాట మే 12కు రాకపోవచ్చంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. 2 రోజుల నుంచి ఈ డిస్కషన్ నడుస్తున్నప్పటికీ, గమ్మత్తుగా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
3 రోజుల కిందట ఉగాది సందర్భంగా సర్కారువారి పాట సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో మే 12 రిలీజ్ అని క్లియర్ గా చెప్పారు. ఆ తర్వాతే ఇలా పుకార్లు మొదలవ్వడం ఆశ్చర్యం, ఆసక్తికరం కూడానూ.