నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారనే వార్తలకు ఫుల్స్టాప్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని వీడనని ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేసిన అనిల్‌కుమార్ యాదవ్.. ఇవాళ ప్రత్యర్థులపై ఫైర్ అయ్యారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే లోకేశ్ వెంట వెళ్లాలని ఆయన కోరారు. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లడం ఆనం రామనారాయణరెడ్డి చరిత్రగా ఆయన చెప్పుకొచ్చారు. అవినీతిపరుడైన ఆనం రామనారాయణరెడ్డిని పక్కన పెట్టుకుని అవినీతి గురించి లోకేశ్ విమర్శలు చేయడం విడ్డూరంగా వుందన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలుస్తామన్నారు. ఆనం రామనారాయణరెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమన్నారు. ఆనం కుటుంబానికి ఇంకా మంచిపేరు ఉందంటే అది విజయ్‌కుమార్‌రెడ్డి వల్లే అని ఆయన అన్నారు.
వైసీపీలో కలుపు మొక్కల్ని తామే పీకి పక్కన పడేసినట్టు అనిల్ చెప్పారు. నారా లోకేశ్‌ది విహారయాత్ర అని విమర్శించారు. గతంలో తమ నాయకుడు వైఎస్ జగన్ ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. కానీ లోకేశ్ మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు కాసేపు నడిచి కాలయాపన చేస్తున్నారని వెటకరించారు. లోకేశ్ మాట్లాడే ముందు భాష నేర్చుకోవాలని హితవు చెప్పారు.
లోకేశ్‌కు నిజంగా దమ్ముంటే జిల్లాలో అభివృద్ధిపై చర్చకి రావాలని అనిల్‌కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. రాష్ట్రమంతా లోకేశ్ పాదయాత్ర తరువాత ముందు మందలగిరిలో గెలవాలని వ్యంగ్యంగా అన్నారు.