మళ్లీ పెళ్లి.. మళ్లీ అదే లొల్లి

సీనియర్ నటుడు నరేష్ హీరోగా నటించిన సినిమా మళ్లీ పెళ్లి. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా ఎదురైన వివాదాల గురించి అందరికీ తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, ఈ సినిమా…

సీనియర్ నటుడు నరేష్ హీరోగా నటించిన సినిమా మళ్లీ పెళ్లి. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా ఎదురైన వివాదాల గురించి అందరికీ తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, ఈ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ కోర్టులో కేసు వేశారు. అయితే అలా కేసు పడిన గంటల వ్యవధిలోనే ఆ లీగల్ ఇష్యూ నుంచి నరేష్ బయటపడ్డారు. సినిమా రిలీజ్ కు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.

ఇప్పుడు సరిగ్గా ఇదే అడ్డంకి, మళ్లీ ఓటీటీ రిలీజ్ కు ఎదురైంది. మళ్లీ పెళ్లి సినిమాను 2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ పెట్టేందుకు నరేష్, ఒప్పందం చేసుకున్నారు. ఇటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో, అటు ఆహాలో నాన్ ఎక్స్ క్లూజివ్ రైట్స్ కింద సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నామని ప్రకటించారు. మరోసారి గట్టిగా ప్రచారం కూడా చేశారు.

ఈసారి కూడా రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్న మళ్లీ పెళ్లి సినిమా స్ట్రీమింగ్ ను ఆపాలంటూ ఆమె కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ప్రకారం, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో మళ్లీ పెళ్లి సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టలేదు. అయితే ఆహా యాప్ లో మాత్రం ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టేశారు. అలా నరేష్ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసినట్టయింది. అయితే అమెజాన్ ప్రైమ్ కు సంబంధించి ఈ లీగల్ ఇష్యూను నరేష్ ఎలా ఫేస్ చేస్తారో చూడాలి.

అగ్రిమెంట్స్ విషయంలో అమెజాన్ ప్రైమ్ చాలా నిక్కచ్చిగా ఉంటుంది. సినిమా రైట్స్ కింద ఆ కంపెనీ డబ్బులు చెల్లించే సంగతి పక్కనపెడితే, ఏదైనా తేడా వస్తే తిరిగి నిర్మాతే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి హీరో కమ్ నిర్మాత నరేష్, ఈ పరిస్థితి నుంచి వీలైనంత తొందరగా బయటపడాల్సి ఉంటుంది.

నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కింది మళ్లీ పెళ్లి సినిమా. రియల్ లైఫ్ లో నరేష్ తో సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేశ్, ఈ సినిమాలో నరేష్ లవర్ గా నటించింది. సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు నటించారు. తెలుగులో ఆయనకు ఇదే చివరి చిత్రం.