సినీ సెలబ్రిటీలకు రాజకీయాలంటే మోజు ఉంటుంది. సినిమాల్లో నటన చూసి అభిమానులు “ఆహా ఓహో” అని పొగడ్తల వర్షానికి తడిసి ముద్దయ్యే సినీ సెలబ్రిటీలు … అదే ప్రజాదరణగా భావించి మరింత మంది ఆదరణ పొందాలంటే రాజకీయాల్లోకి వెళ్లడమే సరైందని భావిస్తుంటారు.
అలా అనుకుని రాజకీయాల్లోకి వెళ్లి, ఆ తర్వాత వాస్తవాల్ని గ్రహించి తప్పుకున్న వాళ్లున్నారు. ఇప్పుడా కోవలోకి ప్రముఖ సీనియర్ నటుడు, టీడీపీ నేత మాగంటి మురళీమోహన్ చేరారు. సీనియర్ నటుడిగా, ప్రముఖ నిర్మాతగా మురళీమోహన్ పాత్ర ఇండస్ట్రీలో చాలా కీలకమైంది.
రాజకీయాల్లో మునిగి తేలుతూ పదేళ్ల పాటు కళామతల్లికి దూరంగా ఉంటున్న ఆయన, మరోసారి తన మాతృరంగంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో 2021లో కొత్త ప్రయాణంపై ఆయన తన మనసులో మాటను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా తన సొంత నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్స్‌లో సినిమాలు తీయాలని ఆయన సిద్ధమయ్యారు.
చిత్రపరిశ్రమలో కొత్త ప్రయాణం మొదలు పెట్టాలని భావిస్తున్న తనకు , మొదటి సినిమాకు కలిగిన అనుభూతి ఇస్తోందన్నారు. తాను చిత్రపరిశ్రమలో అడుగు పెట్టిన రోజులతో పోలిస్తే, ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమ మొత్తం మారిపోయిందన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ కూడా భారీగా పెరిగిందన్నారు.
ఇప్పుడు రూ. 100 కోట్లు, రూ.200 కోట్లు , రూ.500 కోట్ల బడ్జెట్లో సినిమాలు తీస్తుండడాన్ని చూస్తున్నామన్నారు. పరిశ్రమలో వచ్చే మార్పులకు అనుగుణంగా నటనలో మార్పు తెచ్చుకుంటేనే ఎవరికైనా మనుగడ ఉంటుందన్నారు.
పదేళ్ల గ్యాప్ తర్వాత పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్నట్టు మురళీమోహన్ చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం బాలకృష్ణ నటించిన ‘జైసింహా’ చిత్రంలో కనిపించినా పెద్దగా ఆదరణకు నోచుకోలేదన్నారు. ప్రస్తుతానికి వస్తే ఓ వెబ్ సిరీస్‌లో అన్నదమ్ముళ్లగా నటిస్తున్న జగపతిబాబు, శరత్ కుమార్‌లకు తండ్రిగా నటిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇక మీదట తనకూ, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని మురళీమోహన్ తేల్చి చెప్పారు. తన దృష్టంతా నటన, సినిమా నిర్మాణంపైనే ఉంటుందన్నారు. సినిమా తనకు తల్లి లాంటిదని, దాని నుంచే ఎదిగామన్నారు. అలాంటి సినిమాను మరిచిపోలేనని ఆయన స్పష్టం చేశారు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని సినిమాల్లో నటించేందుకు ఫిట్‌గా ఉన్నట్టు ఆయన తెలిపారు.