పార్టీ సొంతది అనగానే.. జాగ్రత్తపడుతున్నారా!

విప్లవ పార్టీలలో ఉండి పోరాటాలు చేసినప్పుడు ప్రజాయుద్ధ నౌక అనే బిరుదులు కూడా సొంతం చేసుకున్న ప్రజా గాయకుడు గద్దర్ అనే గుమ్మడి విఠల్ రావు నిత్యం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తీవ్రంగా…

విప్లవ పార్టీలలో ఉండి పోరాటాలు చేసినప్పుడు ప్రజాయుద్ధ నౌక అనే బిరుదులు కూడా సొంతం చేసుకున్న ప్రజా గాయకుడు గద్దర్ అనే గుమ్మడి విఠల్ రావు నిత్యం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. ఆయన అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతుంటారు. 

తెలంగాణకు కెసిఆర్ ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తూ ఉంటారు. వీటన్నింటి కంటే తరచుగా.. ఈసారి ఎన్నికలలో గజ్వేల్ నుంచి కేసీఆర్ మీద పోటీకి తాను బరిలో దిగుతానని ఆయన అరాచకాలపై గళమెత్తి ఓడించి తీరుతానని గద్దర్ పలుమార్లు ప్రకటించారు. 

గజ్వేల్ లో కేసీఆర్ మీద పోటీ చేయడం మాత్రం తధ్యమని అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేసేది తర్వాత వెల్లడిస్తానని గద్దర్ చెబుతూ వచ్చారు. తాజాగా ఆయన స్వయంగా సొంత పార్టీ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ మీద పోటీకి వెనక్కి తగ్గుతున్నారేమో, ఆ మేరకు జాగ్రత్త పడుతున్నారేమో అని అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

గద్దర్ కొంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీతో కూడా సన్నిహితంగా మెలిగారు. కేసీఆర్ ను వ్యతిరేకించే ఏ పార్టీ అయినా వారితో చేతులు కలపడానికి ఆయన సుముఖంగానే ఉంటారు. కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ ఒక వినతిపత్రం తీసుకుని బిజెపి ఎంపీ బండి సంజయ్ ను కూడా కలిశారు గానీ, తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రకటన చేశారు తప్ప బారాస నేతలను కలవలేదు. తీరా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన తర్వాత కేసీఆర్ కు కనీసం ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. 

కేసీఆర్ పట్ల ఆయనలో తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. ఇన్నాళ్లు వివిధ పార్టీలతో స్నేహంగానే మెలిగిన గద్దర్.. మునుగోడు ఉపఎన్నిక సమయంలో కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థి అవతారనే ప్రచారం తొలుత జరిగింది. చివరికి అక్కడ పాల్ స్వయంగా రంగంలోకి దిగి కేవలం ఎనిమిది వందల ఓట్లు సాధించి భంగపడ్డారు.

ఇటు గద్దర్ విషయాన్ని పరిశీలిస్తే ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకుంటున్నారు. గద్దర్ ప్రజా పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్కు ఆయన కేంద్ర ఎన్నికల సంఘం వద్ద దరఖాస్తు సమర్పించారు. సొంత పార్టీ తరఫున గజ్వేల్ నుంచి పోటీ చేస్తారా అని అడిగినప్పుడు ఆయన మాట దాటవేస్తున్నారు. 

ఇదివరకు కేసీఆర్ మీద తానే పోటీ చేయాలనేది తన వ్యక్తిగత అభిప్రాయంగా ఉండేదని, ఇప్పుడు తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనేది పార్టీలో చర్చించి తర్వాత ప్రకటిస్తానని అంటున్నారు. తన సొంత పార్టీ అయ్యేసరికి గెలుపోటములు గురించి ఆయన అతి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఉంది. 

సొంత పార్టీ తరఫున ఖచ్చితంగా గెలిచి తీరాలనే కోరికతో, కేసీఆర్ మీద తొడ కొట్టాలనే అత్యుత్సాహాన్ని వదులుకుని, ఆయన సేఫ్ సీటు ఎంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? అనే అభిప్రాయం కూడా కలుగుతోంది.