‘‘ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ కు కోపం వచ్చింది. కత్తి దూశారు. వేటు వేశారు. తనకు కోపం వస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని చాటిచెప్పారు.’’ అవునా.. ఏం జరిగిందా అని నివ్వెరపోతున్నారా?
ప్రజాశాంతి అనే తాను స్థాపించిన పార్టీ నుంచి ఉద్యమనాయకుడుగా ఒకప్పట్లో పెద్ద గుర్తింపు ఉన్న గద్దర్ ను బహిష్కరిస్తున్నట్టుగా కెఎ పాల్ ప్రకటించారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున, బహిష్కరణ వేటు వేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అసలు కెఎ పాల్ ది ఒక పార్టీ.. దానికి మళ్లీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కూడానా?.. అని పెదవి విరవకండి. ఇదంతా అచ్చంగా నిజం.
తెలంగాణలో ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవబోయేది ప్రజాశాంతి పార్టీ మాత్రమేనని, ముఖ్యమంత్రి కాబోయేది తానేనని కెఎ పాల్ చాలా సార్లు ప్రకటించారు. మునుగోడు ఎన్నికల్లోనే తమ పార్టీ సత్తా చూపిస్తాం అని కూడా ఆయన అప్పట్లో చాలా భీషణమైన ప్రతిజ్ఞలు చేశారు. మునుగోడు ఎన్నికలకు ముందుగా.. ‘ప్రజా యుద్ధ నౌక’గా పాత గుర్తింపు ఉన్న ప్రజాగాయకుడు గద్దర్ ను ఆయన తన ప్రజాశాంతి పార్టీలో చేర్చుకున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి తరఫున గద్దర్ పోటీచేస్తారని పాల్ ప్రకటించారు. ఆయనకు బీఫారం అందిస్తున్నట్టుగా ఫోటోలు కూడా వచ్చాయి. తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఎన్నికల బరిలోకి గద్దర్ అడుగుపెట్టలేదు. పాల్ స్వయంగా నామినేషన్ వేశారు. ఎప్పటిలాగానే తాను గెలిచి తీరుతానని ఆయన భీషణ ప్రతిజ్ఞలు చేశారు. మొత్తానికి సదరు మునుగోడు ఉప ఎన్నికలో పాల్ 805 ఓట్లు సాధించారు.
కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అరాచకాలకు పాల్పడిందని, తాను గెలవాల్సి ఉండగా, ఎన్నికల అక్రమాల వల్ల ఓడిపోయానని, ఈ ఎన్నికల అక్రమాలపై ఈసీ విచారణ చేయించాలని పాల్ రకరకాల డిమాండ్లు చేశారు. అక్కడితో గద్దర్ తో ప్రజాశాంతి అనుబంధం కూడా మరుగున పడిపోయింది. గద్దర్ అసలు ప్రజాశాంతి పార్టీలో చేరారా లేదా అనేది కూడా ఎవ్వరికీ తెలియకుండానే పోయింది.
తీరా ఇప్పుడు ఈ వ్యవహారం చర్చల్లోకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మీద పోటీచేసి ఆయనను ఓడిస్తానని పాల్ స్థాయిలోనే పట్టుదలగా చెబుతున్న గద్దర్.. తాను కొత్త పార్టీ స్థాపించే ప్రయత్నాల్లో ఉన్నారు. బుధవారం నాడు ఆయన ఢిల్లీలో కొత్త పార్టీ స్థాపనకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారు.
గద్దర్ కొత్త పార్టీ స్థాపన ప్రయత్నాల్లో ఉండడం పాల్ కు ఆగ్రహం తెప్పించినట్లుంది. అంతే.. వెంటనే తన ప్రజాశాంతి పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు చేరిక ఎప్పుడు జరిగిందో తెలియకపోయినా.. ప్రజలకు ఈ బహిష్కరణ కామెడీ మాత్రం నవ్వు తెప్పిస్తోంది.