పొలిటికల్ ప్రసంగాల్లో భాగంగా హీరోల్లో తన స్థాయి ఏంటనే విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా బయటపెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరోల్లో తనకంటే ప్రభాస్, మహేష్ పెద్ద హీరోలని అన్నారు.
“ప్రభాస్ నా కంటే పెద్ద హీరో. మహేష్ బాబు నా కంటే పెద్ద హీరో. ఈ విషయం చెప్పడానికి నాకేం ఇగో లేదు. వాళ్లు నా కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు, వాళ్లు పాన్ ఇండియా హీరోలు. రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. నేను ప్రపంచవ్యాప్తంగా తెలియదు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఇగోస్ లేవు.”
మహేష్ కంటే పవన్ ఎక్కువ పారితోషికం తీసుకుంటాడని కొందరు.. పవన్ కంటే మహేషే ఎక్కువ తీసుకుంటాడని మరికొందరు వాదించుకోవడం సర్వసాధారణం. ఎట్టకేలకు ఈ చర్చకు పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టారు. తనకంటే మహేష్ పారితోషికం ఎక్కువని ఆయన అంగీకరించారు. అంతేకాదు, తనకు అందరు హీరోలు ఇష్టమేనని, ఫ్యాన్ వార్స్ వద్దని కోరారు.
“సినిమా అనేది వినోదం, ఆనందం. నాకు ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ.. ఇలా హీరోలందరూ ఇష్టమే. వాళ్ల సినిమాలు నేను చూస్తాను, కనిపిస్తే మాట్లాడుకుంటాం. వాళ్లతో నాకు ఎలాంటి సమస్యలు లేవు.”
సినిమాల పరంగా హీరోల మీద ఉన్న ఇష్టాన్ని రాజకీయాల్లో చూపించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని.. సినిమాల్లో ఏ హీరోను ఇష్టపడినా, రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి సమిష్టింగా ఆలోచించాలని అన్నారు. అందరి హీరోల అభిమానులు తనకే ఓటేయాలని పరోక్షంగా కోరారు. తనలాంటి పోరాటం చేసే వ్యక్తుల్ని వదులుకోవద్దని ప్రజలకు హితవు పలికారు.