పవన్ సిఎమ్ కాదట

తాను సిఎమ్ కాలేనని ఒకసారి, సిఎమ్ ఎలా అవుతానని మరోసారి, సిఎమ్ తానే అని ఇంకోసారి చెబుతూ వస్తున్నారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. ఇప్పుడు అసలు విషయం చెప్పారు. తాను తన అభిమానుల కోసం…

తాను సిఎమ్ కాలేనని ఒకసారి, సిఎమ్ ఎలా అవుతానని మరోసారి, సిఎమ్ తానే అని ఇంకోసారి చెబుతూ వస్తున్నారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. ఇప్పుడు అసలు విషయం చెప్పారు. తాను తన అభిమానుల కోసం తానే సిఎమ్ అంటున్నాను తప్ప వేరు కాదని క్లారిటీ ఇచ్చారు.

‘’..అభిమానులు ‘సీఎం సీఎం’ అని నినదిస్తుంటే ‘నేను సిద్ధం’ అని సంకేతాలు పంపాను… సీఎం పదవి ఒకేసారి వస్తుందా.. అంచెలంచెలుగా వస్తుందా అనేది చూడాలని’’ పవన్ లేటెస్ట్ గా వ్యాఖ్యానించారు.

మళ్లీ ఇక్కడ కూడా కాస్త అయోమయ వ్యవహారమే. సిఎమ్ కావాలని ఆయనకు వుంది. కానీ అది ఎలా వస్తుందో తెలియదు. కానీ ఫ్యాన్స్ అంటున్నారని, తాను రెడీ అంటున్నారు. ఇదెలా వుందీ అంటే అదేదో సినిమాలో బ్రహ్మానందాన్ని అందరూ అచ్చం హీరోలా వున్నావు బాసూ అంటే హీరోనే అనే ఫీలయిపోయినట్లు?

‘’సీఎం’ అని మా వాళ్ల కోసం అన్నాను. కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకువెళ్లే పదవి అంటే చాలా అనుభవం కావాలి. దీనికి క్షేత్రస్థాయి పర్యటనలు, సమస్యలపై అవగాహన తెచ్చుకోవాలి. సీఎం సీఎం అని మావాళ్లు అదేపనిగా అరుస్తుంటే… నా కేడర్‌ స్టేట్‌మెంట్‌ను ఆమోదించాను. సీఎం అని మావాళ్లు అనుకుంటే సరిపోదు. ప్రజలు కూడా అనుకోవాలి…’ అంటున్నారు పవన్.

అభిమానులు అనుకోవడం, ప్రజలు అనుకోవడం కాదు, అసలు పవన్ కు తాను సిఎమ్ కావడానికి ఏం చేయాలో, ఏం కావాలో అన్నది తెలుసా? సిఎమ్ కావాలని అనుకోవడం వేరు, ఎవరో అనడం వేరు, ఆ దిశగా పయనించడం వేరు. 

కానీ గమ్మత్తేమిటంటే మళ్లీ పవన్ నే ఆ పదవి కావాలంటే చాలా అనుభవం కావాలి. క్షేత్రస్థాయిలో తిరగాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి అంటారు. కానీ ఆ దిశగా మాత్రం వెళ్లరు. ఆయనకు తోచినపుడు తోచిన చోటకు వెళ్లి రంకెలు వేసి మళ్లీ షూటింగ్ లకు వెళ్లిపోతారు.