అడ్డుకోడానికి దారేది?

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాల‌ని బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌రెడ్డి చేసిన ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. హైకోర్టులో ప్ర‌తికూల తీర్పుతో వెన‌క్కి త‌గ్గుతార‌ని అంద‌రూ భావించారు. అయితే సుప్రీంకోర్టు వ‌ర‌కూ…

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాల‌ని బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌రెడ్డి చేసిన ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. హైకోర్టులో ప్ర‌తికూల తీర్పుతో వెన‌క్కి త‌గ్గుతార‌ని అంద‌రూ భావించారు. అయితే సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్లినా ఫ‌లితం లేకుండా పోయింది. టీటీడీకి చెందిన ప‌ద్మావ‌తి నిల‌యంలో కొత్త క‌లెక్ట‌రేట్ ఏర్పాటుకు స‌ర్వోన్న‌త న్యాయస్థానం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఎన్నిక‌ల హామీని నెర‌వేర్చే క్ర‌మంలో జిల్లాల పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగా  ఏప్రిల్ మొద‌టి వారంలో కొత్త జిల్లాల నుంచి పాల‌న మొద‌లు పెట్టాల‌ని ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. నూత‌న క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాలుగా ప్ర‌భుత్వంతో పాటు ప్రైవేట్ భ‌వ‌నాల‌పై అధికారులు దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో బాలాజీ జిల్లా కార్యాల‌యంగా తిరుచానూరు స‌మీపంలోని ప‌ద్మావ‌తి నిల‌యాన్ని అధికారులు ఎంపిక చేశారు.

ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ తిరుప‌తికి చెందిన బీజేపీ నాయ‌కుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. టీటీడీ భ‌క్తుల వ‌స‌తి సౌక‌ర్యార్థం నెల‌కొల్పిన ప‌ద్మావ‌తి నిల‌యాన్ని క‌లెక్ట‌రేట్‌కు వాడుకోవ‌డంపై అభ్యంత‌రం చెబుతూ ఆయ‌న న్యాయ‌స్థానంలో పిటిష‌న్ వేశారు. టీటీడీ ఆదాయాన్ని హ‌రించిన‌ట్టు అవుతుంద‌ని కూడా పిటిష‌న్‌లో ఆయ‌న పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు సింగిల్ బెంచ్‌ పిటిష‌న‌ర్ వాద‌న‌తో ఏకీభ‌వించి ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టింది.

ఆ త‌ర్వాత సింగిల్ బెంచ్ తీర్పుపై ప్ర‌భుత్వం డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించింది. అక్క‌డ ప్ర‌భుత్వానికి సానుకూల తీర్పు వచ్చింది. ఎలాంటి మార్పులు చేయ‌కుండా కొత్త క‌లెక్ట‌రేట్‌కు ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని హైకోర్టు డివిజ‌న్ బెంచ్ తీర్పు వెలువ‌రించింది. ఈ తీర్పుపై భానుప్ర‌కాశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ భానుకు ఎదురు దెబ్బ త‌గిలింది.

పద్మావతి నిలయంలో కొత్తగా కలెక్టరేట్ ఏర్పాటుకు  సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై  జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తాత్కాలికంగా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు అభ్యంతరం ఎందుకని పిటిష‌న‌ర్‌ను న్యాయస్థానం ప్ర‌శ్నించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాక‌రించింది. అలాగే ఈ పిటిష‌న్‌ను కొట్టివేసింది. న్యాయ ప‌రంగా భానుప్ర‌కాశ్‌రెడ్డికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ నేప‌థ్యంలో పాల‌న‌ను అడ్డుకోడానికి భానుకు దారేది? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.