రాష్ట్రపతి అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడి పేరును బీజేపీ ప్రతిపాదించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాయం ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. వెంకయ్యనాయుడి గురించి తెలుగు సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ప్రస్థానం మొదలెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో సేవలందించి తెలుగు వారికి గౌరవం తెచ్చారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా తనవంతు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఆయనకు పదోన్నతి కల్పించేందుకు బీజేపీ అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఆయన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయమై ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మీడియా, సామాజిక మాధ్యమాలలో వస్తున్నవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది. దీంతో ఫేక్ న్యూస్‌కు చెక్ పెట్టినట్టైంది.