ముగ్గురి మ‌ధ్య‌ ట్వీట్స్ ఫైట్‌

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.క‌విత‌, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి మ‌ధ్య ట్వీట్స్ ఫైట్‌కు తెర‌లేచింది. ధాన్యం కొనుగోలు విష‌య‌మై ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు గుప్పించుకోవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఇందులో బీజేపీ త‌ల‌దూర్చ‌క పోవ‌డాన్ని…

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.క‌విత‌, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి మ‌ధ్య ట్వీట్స్ ఫైట్‌కు తెర‌లేచింది. ధాన్యం కొనుగోలు విష‌య‌మై ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు గుప్పించుకోవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఇందులో బీజేపీ త‌ల‌దూర్చ‌క పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. రాహుల్‌గాంధీ తెలుగులో ట్వీట్ చేయ‌డం అన్నిటికంటే పెద్ద ట్విస్ట్‌. అస‌లీ ట్వీట్ల గోలేంటో చూద్దాం.

‘ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి.. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుంది’  అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య, ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. ఆమె ట్విట‌ర్ వేదిక‌గా రాహుల్‌కు హిత‌వు చెప్పారు.

‘మీరు ఎంపీగా ఉండి రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్‌లో సంఘీభావం తెలపడం కాదు.. మీకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హర్యానాకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉంది’ అంటూ కవిత ట్వీట్ చేశారు. క‌విత ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి  మార్క్ సెటైర్ విసిరారు.

టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని … సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని మండిప‌డ్డారు. ‘ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు’  అంటూ రేవంత్ రెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా దెప్పి పొడిచారు.