ఆమె కుండ బద్దలు కొట్టారు …కేసీఆర్ ఆలోచించుకోవాలి

కేసీఆర్ ఎవరిమీదనైనా పగబట్టారంటే ఇక అంతే. పగబట్టినవారిని కన్నెత్తి చూడరు. పన్నెత్తి మాట్లాడారు. తనతో కలిసి పనిచేసినవారు కావొచ్చు. దేశ ప్రధాని కావొచ్చు. తెలంగాణా ఉద్యమంలో తనతో కలిసి పనిచేసినవారిని, అడుగులో అడుగు వేసినవారిని,…

కేసీఆర్ ఎవరిమీదనైనా పగబట్టారంటే ఇక అంతే. పగబట్టినవారిని కన్నెత్తి చూడరు. పన్నెత్తి మాట్లాడారు. తనతో కలిసి పనిచేసినవారు కావొచ్చు. దేశ ప్రధాని కావొచ్చు. తెలంగాణా ఉద్యమంలో తనతో కలిసి పనిచేసినవారిని, అడుగులో అడుగు వేసినవారిని, తెలంగాణా కోసం జెండా మోసినవారిని ఎందరినో అధికారంలోకి వచ్చాక దూరం పెట్టారు. తెలంగాణా ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన ప్రొఫెసర్ కోదండరాంను వదిలించుకున్నారు.

ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివారు చాలామంది ఉన్నారు. ఉద్యమంలో పాల్గొననివారిని, తనను బండబూతులు తిట్టినవారిని అక్కున చేర్చుకున్నారు. మంత్రి పదవులు ఇచ్చి అందలం ఎక్కించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఓడిపోయిందని ఆక్రోశంతో, ఉక్రొషంతో ధాన్యం సేకరణను భూతద్దంలో చూపించి కేంద్రంతో గొడవకు దిగారు. మోడీని ప్రతిరోజూ బూతులు తిడుతున్నారు. తెలంగాణా గొప్ప …కేంద్రం దిబ్బ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.

మోడీ ముచ్చింతల్ కు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించలేదు. తాను గురువుగా గౌరవించే చిన జీయర్ స్వామితో సంబంధాలు తెంపుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కూడా బీజేపీ వ్యక్తిగా భావించి మోడీకి ఇచ్చిన ట్రీట్ మెంటే ఆమెకూ ఇచ్చారు. బడ్జెట్ సమావేశంలో ప్రసంగించనివ్వలేదు. తాను చెప్పినట్లు వినడంలేదని గవర్నర్ మీద కోపం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండ్ గవర్నర్ ఇద్దరూ ముఖ్యమే కదా. వీళ్లలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి. 

ఇప్పుడు ఆ పని గవర్నర్ తమిళిసై చేశారు. ఒక అడుగు ముందుకేశారు. కేసీఆర్ కు స్నేహ హస్తం చాచారు. ఆయనేం చేశాడో, తానేం చేసిందో కుండ బద్దలు కొట్టారు. రాజ్ భవన్లో నిర్వహించే ఉగాది వేడుకలకు కేసీఆర్ ను ఆహ్వానించారు. తన ఆహ్వానాన్ని కేసీఆర్‌ స్వీకరిస్తారని భావిస్తున్నానని అన్నారు. కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాన్ని ఆకాంక్షిద్దామన్నారు. ముఖ్యమంత్రి చాలా కాలంగా రాజ్‌భవన్‌కు రావడం లేదు. ఈ గ్యాప్‌కి తన వైపు నుంచి ఎలాంటి కారణాలు లేవన్నారు. నేను అత్యంత బలమైన వ్యక్తిని.. నన్ను కట్టడి చేయలేరు.

ప్రభుత్వం చేసే ప్రతి సిఫారసు ఆమోదించాలని లేదు. నా మంచితనాన్ని వాడుకోవడాన్ని అంగీకరించను. రాజ్‌భవన్‌ రాజకీయాలకు కేంద్రమైందనడం సరికాదు. బడ్జెట్‌ సమావేశాల్లో నా ప్రసంగాన్ని సర్కారు రద్దు చేసింది అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేసారు.‘రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నా. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార, విపక్ష పార్టీల నేతలు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నా. ఇది నా మర్యాద. నా ఆహ్వానాన్ని అందరూ స్నేహపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నా..’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు.

‘ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పాత విషయాలను మరిచి కొత్త ఆరంభాన్ని మనమందరం ఆకాంక్షిద్దాం. విభేదాలన్నీ కనుమరుగు కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. నేను ఏ సమస్యనూ సృష్టించాలని కోరుకోను. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నానని గవర్నర్ అన్నారు. గవర్నర్ ఇంత స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇక ఏం చేయాలో కేసీఆర్ ఆలోచించుకోవాలి.