డొనాల్డ్ ట్రంప్ పాలన ముగిసింది. ఈరోజు నుంచి అమెరికాలో కొత్త అధ్యక్షుడి పాలన మొదలుకాబోతోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు (ఇండియన్ టైమ్ రాత్రి 10.30) అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ భవనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బైడెన్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ సేవలు అందించబోతున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా వైట్ హౌజ్ కు చేరుకొని తన పనులు మొదలుపెడతారు బైడెన్. ఇప్పటికే పాత అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌజ్ ఖాళీ చేశారు.
సంప్రదాయం ప్రకారం బైడెన్ ప్రమాణస్వీకారానికి ట్రంప్ హాజరుకావాలి. కానీ రెబల్ గా పేరుపొందిన ట్రంప్.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావడం లేదు, నేరుగా తన సామాన్లతో ఫ్లోరిడా వెళ్లిపోతున్నారు.
బైడెన్ కంటే ముందే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్. కమల ప్రమాణ స్వీకారం తర్వాత బైడెన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇది అక్కడ పద్ధతి. ప్రమాణ స్వీకారం సందర్భంగా నటుడు టామ్ హ్యాంక్స్ తో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేశారు.
సింగర్ లేడీ గగా జాతీయగీతం ఆలపించనుంది. జెన్నిఫర్ లోపెజ్ తో ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంది. అమెరికాలో ఎన్నికల ప్రక్రియ మొదలుకొని, అధికారాల బదలాయింపు వరకు ఎన్నో వివాదాలు, మరెన్నో సంచలనాలు. తన ఓటమిని ట్రంప్ అంగీకరించలేదు.
ఒక దశలో వైట్ హౌజ్ లోకి ప్రత్యేక దళాలు ప్రవేశించి, ట్రంప్ ను ఖాళీ చేయించి ఇంటికి పంపిచేస్తాయనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. మరోవైపు క్యాపిటల్ హిల్ పై ట్రంప్ అభిమానులు దాడిచేసిన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఇంకోవైపు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికన్ సమాజాన్ని రెండుగా విడగొట్టాయి.
ఇలాంటి ఎన్నో వివాదాల మధ్య అమెరికాలో కొత్త రాజకీయ శకం మొదలైంది. తాజా ఎన్నికల ప్రక్రియతో అమెరికా రాజ్యాగంలో డొల్లతనం బయటపడింది. ప్రత్యేక చట్టాల ద్వారా వీటిని సరిచేసేందుకు బైడెన్ సర్కార్ ప్రయత్నించే అవకాశం ఉంది. గత ఏడాది కాలంలో ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై ఇప్పటికే పునఃసమీక్ష మొదలైన సంగతి తెలిసిందే.