తన రాజీనామాను ఆమోదించుకోవాలని విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పట్టుదలతో ఉన్నారు. ఈయన టీడీపీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే టీడీపీ అధికారాన్ని పోగొట్టుకున్నప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ కార్యకలాపాల్లో ఆయన పాల్గొనడం లేదు. చంద్రబాబును కలవడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు. అలాగని పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు టీడీపీ సిద్ధంగా లేదు.
ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు గత ఏడాది ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. రాజీనామాతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచారు. గంటా రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించలేదు.
తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ ఇటీవల మరోసారి స్పీకర్‌కు ఆయన లేఖ రాశారు. అయినప్పటికీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ ఫార్మేట్లో నిబంధనల ప్రకారం రాజీనామా చేసినా ఎందుకు ఆమోదించలేదనే ప్రశ్న ప్రతిపక్షాల నుంచి ఎదురవుతోంది.
తన రాజీనామాను ఆమోదించడంలో స్పీకర్ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండడంతో హైకోర్టును ఆశ్రయిం చేందుకు గంటా నిర్ణయించుకున్నారు. రాజీనామా ఆమోదం కోసం గంటా న్యాయపోరాటానికి దిగనుండడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.