హీరోలు హీరోలు..బయ్యర్లు జీరోలు

టాలీవుడ్ రాను రాను ప్రమాదకర ధోరణి దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. మఖ్యంగా కొందరు హీరోల విషయంలో దారుణమైన పోటీలకు పోయి కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు, లాభాల్లో వాటలు ఇస్తున్నారు. ఆపై దర్శకులకు అదే రేంజ్…

టాలీవుడ్ రాను రాను ప్రమాదకర ధోరణి దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. మఖ్యంగా కొందరు హీరోల విషయంలో దారుణమైన పోటీలకు పోయి కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు, లాభాల్లో వాటలు ఇస్తున్నారు. ఆపై దర్శకులకు అదే రేంజ్ లో ఇవ్వాల్సి వస్తోంది. 

ఎప్పుడైతే ఈ రేంజ్ లో హీరోలకు, దర్శకులకు రెమ్యూనిరేషన్లు ఇస్తున్నారో, అంతకు అంతా రాబట్టడానికి సినిమాకు కూడా కాస్త భారీగానే పెట్టాల్సి వస్తోంది. ఇంత చేసిన తరువాత సినిమా థియేటర్ హక్కులను వంద కోట్లకు పైగా మార్కెట్ చేయాల్సి వస్తోంది. ఇప్పుడు ఏ తెలుగు పెద్ద సినిమా చూసుకున్నా థియేటర్ మార్కెట్ 70 నుంచి 150 కోట్ల మేరకు వుంటోంది. సినిమా హిట్ అయితే ఓకె లేదంటే చాలా లెక్కలు తేడా వచ్చేస్తున్నాయి. అయినా నిర్మాతల పోటీ ఆగడం లేదు.

కేవలం ముఫై నుంచి నలభై రోజులు కాల్ షీట్ ఇస్తే చాలు 60 నుంచి 70 కోట్లు హీరోల చేతిలో పోస్తున్నారు. అది చాలక ఇంకా పోటీకి పోయి లాభాల్లో పావలా వాటా ఇచ్చేస్తున్నారు. టాలీవుడ్ లో కాస్త మార్కెట్ వున్న ఏ హీరో రెమ్యూనిరేషన్ కూడా పాతిక కోట్లకు లోపు లేదు. హీరోకే పాతిక కోట్లు ఇస్తుంటే నిర్మాణ వ్యయం ఎంత రేంజ్ లో వుంటుంది.

ఓ పెద్ద హీరో సినిమాను గుట్టు చప్పుడు కాకుండా వీలయినంత వరకు ‘బాడీ డబుల్’ అనబడే డూప్ తో లాగించేస్తున్నారు. భవిష్యత్ లో ఈ సినిమాను రెండు వందల కోట్లకు మార్కెట్ చేసేస్తారు. అలాగే అన్నీ కలిపి దాదాపు 80 కోట్ల వరకు తీసుకుంటున్న హీరో ముఫై రోజులే ఇస్తానని చెప్పి, మళ్లీ దాంట్లో కూడా ఒకటి రెండు రోజులు తగ్గించుకుంటున్నారు. చివర్న చేసి, ఇక చాలు ఒక రోజుతో ఫైట్ ఆపేయండి, ఇంక పాట అక్కరలేదు వదిలేయండి అంటున్నారు.

ఒక డిజాస్టర్ ఇచ్చిన తరువాత ఓ బ్లాక్ బస్టర్ ఇస్తే చాలు, మూడు సినిమాలకు ముఫై కోట్లు ఇచ్చి మరీ లాక్ చేస్తున్నారు. చాలా ఫ్లాపులు ఇచ్చి, ఒక్క హిట్ ఇస్తే చాలు పది నుంచి పన్నెండు కోట్లు చేతిలో పెట్టి లాక్ చేస్తున్నారు.

హీరోలు ఇంత బద్దకంగా సినిమాలు చేస్తూ కూడా వంద కోట్ల మేరకు రెమ్యూనిరేషన్లు అందుకుంటున్నారు. నిర్మాతలు ఇస్తున్నారు. బయ్యర్లు కూడా ముందు వెనుక చూడకుండా పోటీ పడిపోతున్నారు. ఈ ట్రెండ్ అంతా ఎక్కడికి వెళ్లి ఆగుతుందో అర్థం కావడం లేదని టాలీవుడ్ లోని సీనియర్ నిర్మాతలు అంటున్నారు. ఈ పోటీ పడ లేక చాలా మంది చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారు.

సినిమాకు పెడుతున్న ఖర్చులో సింహభాగం రెమ్యూనిరేషన్లకే పోతోంది. నాన్ థియేటర్ రెవెన్యూ చూసి నిర్మాతలు ఆశపడుతున్నారు. అదే రెవెన్యూ చూపించి హీరోలు ఎంత లాగాలో అంతా లాగేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే చాలు, బయ్యర్లు గతం మరిచిపోతున్నారు. పోటీలు పడిపోతున్నారు. దెబ్బ పడితే చాలు కుదేలైపోతున్నారు.