హవ్వా.. రావణుడి వాహనం గబ్బిలమా..!

వాల్మీకి రామాయణం రచించాడు. ఆ తర్వాత దానికి అనుబంధంగా చాలా వెర్షన్లు వచ్చాయి. ఎవరి విశ్లేషణ వాళ్లది, ఎవరి వర్ణన వాళ్లది. అయితే ఎన్ని రకాల రామాయణాలు వచ్చినా, ఆత్మ చెడకుండా, పాత్రలు మారకుండా…

వాల్మీకి రామాయణం రచించాడు. ఆ తర్వాత దానికి అనుబంధంగా చాలా వెర్షన్లు వచ్చాయి. ఎవరి విశ్లేషణ వాళ్లది, ఎవరి వర్ణన వాళ్లది. అయితే ఎన్ని రకాల రామాయణాలు వచ్చినా, ఆత్మ చెడకుండా, పాత్రలు మారకుండా వచ్చాయి. ఈరోజు వచ్చిన ఆదిపురుష్ లో మాత్రం ఆ ప్రయత్నం కనిపించలేదు. మరీ ముఖ్యంగా రావణాసురుడి విషయంలో.

టీజర్ రిలీజ్ అయినప్పుడే రావణ్ పాత్రపై చాలా విమర్శలు చెలరేగాయి. అతడి గెటప్, మరో కమ్యూనిటీని గుర్తుచేసేలా ఉందని విమర్శించారు చాలామంది. ఇక అతడి గెటప్ కూడా శివభక్తుడిలా కనిపించలేదన్నారు. వీటిలో కొన్నింటిని సినిమాలో కవర్ చేసే ప్రయత్నం చేశారు. టీజర్ లో రావణ్ కు, సినిమాలో రావణ్ కు గ్రాఫిక్స్ పరంగా చిన్న తేడాలు కనిపించాయి.

అయితే రావణుడి వాహనం విషయంలో మాత్రం ఈ మార్పు జరగలేదు. టీజర్ లో రావణుడికి ఓ వింత వాహనం ఇచ్చారు. అప్పట్లో దానిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత గ్రాఫిక్స్ మార్చడం కోసం గ్యాప్ తీసుకున్న యూనిట్. ఈ అంశాన్ని కూడా సరిదిద్దుతుందని భావించారు చాలామంది.

కానీ ఆదిపురుష్ సినిమాలో రావణుడి వాహనాన్ని మార్చలేదు. రావణుడికి వాహనంగా ఓ గబ్బిలాన్ని పెట్టారు. ఈ విషయంలో మాయచేసే ప్రయత్నం కూడా చేయలేదు. అచ్చంగా గబ్బిలం యానిమేషన్ నే చూపించారు. రావణ్ వాహనం గబ్బిలమనే విషయం ఏ రామాయణంలో ఉందో ఓం రౌత్ కే తెలియాలి. ఒక దశలో కుబేరుడిపై యుద్ధం చేసి, అతడి పుష్పక విమానాన్ని లాక్కొని, ఆ రెక్కల రథాన్ని కొన్నాళ్లు రావణుడు ఉపయోగించాడని పురాణాల్లో ఉంది. కనీసం ఇలా చూపించినా సరిపోయేది.

ఇక రావణుడికి చెందిన లంకను చూపించే విధానం కూడా బాగాలేదు. రావణుడి రెండో ప్రాణం లంక. దేవ శిల్పి విశ్వకర్మ నిర్మాణం అది. కుబేరుడి అలకాపురి, ఇంద్రుడి అమరావతిని సైతం తలదన్నే నిర్మాణం అది. ఆకాశంలో కట్టినట్టుండే నగరం అది. ప్రతి ఇంట్లో వేదాలు, శివనామ స్మరణలు వినిపించే నగరం అది. రాత్రిపగలు తేడా లేకుండా వజ్రవైఢూర్య కాంతులతో ధగధగలాడే నగరంగా పురాణాల్లో లంకకు ప్రాముఖ్యత ఉంది. అలాంటి మేలి నగరాన్ని నల్లగా చూపించారు ఆదిపురుష్ సినిమాలో. లంక మొత్తం చీకటిగా కనిపిస్తుంది. 

ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఆదిపురుష్ సినిమా. ప్రభాస్ పై ఉన్న క్రేజ్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగి, సినిమా హాళ్లన్నీ కళకళలాడాయి.