కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చావు దెబ్బ తినడంతో ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు అక్కడికి పరుగెత్తుతున్నారు. కుప్పం టీడీపీలో అసంతృప్తులపై ఆయన దృష్టి సారించి, మళ్లీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వై నాట్ కుప్పం అని సీఎం జగన్ చేస్తున్న నినాదంతో చంద్రబాబు అప్రమత్తం అయ్యారనేది వాస్తవం. నిజమైన రాజకీయ నాయకుడెవరైనా మేల్కొంటారు.
ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గానికి వస్తే… వైసీపీకి పెద్ద దిక్కు ఎవరనే చర్చ నడుస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హైదరాబాద్‌లో ఎక్కువగా వుంటారు. హైదరాబాద్‌లో ఆయన ఫ్యామిలీ వుంటోంది. పులివెందుల నియోజకవర్గ బాధ్యతల్ని ఇంత కాలం అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి చూసుకునే వారు. కానీ ఆయనతో పనులు చేయించుకున్న వారున్నారా? అని ప్రశ్నిస్తే… ఒక్కరంటే ఒక్కరూ కూడా లేరనే సమాధానం వస్తోంది.
పులివెందుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్‌పై అభిమానంతో ఏదో అలా నెట్టుకొస్తున్నారు. కానీ వైఎస్సార్ మాదిరిగా జగన్ ఆదరణగా చూడరనే అభిప్రాయం నియోజకవర్గ ప్రజానీకంలో బలంగా వుంది. ప్రతిదీ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఉన్న రోజులతో జగన్ పాలిస్తున్న వర్తమానాన్ని పోల్చుకుంటూ నిరుత్సాహానికి గురైన పరిస్థితి. వైఎస్ జగన్‌పై సామాన్య ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ పులివెందుల నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన గ్రామ, మండల స్థాయి నాయకుల్లో సీఎం జగన్‌పై ఆగ్రహం వుంది.
ఇదే మొన్నటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపింది. పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపు సీఎం వైఎస్ జగన్‌కు ఒక హెచ్చరిక. కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాగానే చంద్రబాబు మేల్కొన్నారు. కానీ పులివెందుల విషయానికి వస్తే, జగన్‌లో అలాంటి కనువిప్పు రాలేదు. మన పులివెందుల కదా, ఎప్పుడూ నెత్తిన పెట్టుకుంటారనే నమ్మకం సీఎం జగన్‌లో బలంగా ఉన్నట్టుంది. అంతేకాదు, తన తమ్ముడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అంతా చూసుకుంటున్నారనే ధీమా జగన్‌లో వుంది.
ఈ నమ్మకం, ధీమానే రానున్న రోజుల్లో జగన్ కుంప ముంచనున్నాయి. కడప జిల్లాలో వైసీపీపై వ్యతిరేకత… టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కడప జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు జనం పోటెత్తారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంతోకొంత నిజం లేకపోలేదు. కడప జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఖరిపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. వైసీపీ శ్రేణుల్ని పట్టించుకోకపోతే, రానున్న రోజుల్లో టీడీపీకి రాజకీయంగా అనుకూలంగా మారేందుకు దోహదపడుతుంది.
కడప జిల్లా అంతా వైఎస్ అవినాష్‌రెడ్డి చూసుకోవాల్సి వుంది. అయితే వ్యక్తిగతంగా అవినాష్‌రెడ్డి సౌమ్యుడనే పేరు తెచ్చుకున్నప్పటికీ, రాజకీయంగా సమర్థుడు కాదనే టాక్ బలంగా వినిపిస్తోంది. సీఎం జగన్ మాత్రం సొంత జిల్లా వైసీపీ భారాన్ని తమ్ముడిపై వేశారు. అవినాష్‌రెడ్డిని ఎవరైనా కలవాలంటే పులివెందుల్లో ఎప్పుడుంటారో తెలుసుకోవడం మొదట చేయాలి. ఆ తర్వాత ఆయన్ను సుప్రభాత లేదా బ్రేక్ దర్శనం చేసుకోవాల్సి వుంటుంది.
ఇదంతా తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆరు గంటల్లోపు పూర్తి చేసుకోవాల్సి వుంటుంది. ఆ తర్వాత ఆయన పర్యటనలకు వెళ్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా కడప జిల్లాతో పాటు పులివెందులపై జగన్ ప్రత్యేక దృష్టి సారించకపోతే నష్టపోవడం ఖాయమనే హెచ్చరికలు సొంత పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళైనా జగన్ తన జిల్లా, సొంత నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే మంచిది. ఈ విషయంలో చంద్రబాబును జగన్ ఆదర్శంగా తీసుకుంటే నష్టమేమీ లేదు.