కుప్పానికి ఏడుసార్లు ఎమ్మెల్యే…చేసింది నిల్‌!

ఏడుసార్లు కుప్పానికి చంద్ర‌బాబు ఎమ్మెల్యే. చంద్ర‌బాబుకు ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎంతో చేసింది. క‌నీసం నామినేష‌న్ వేయ‌డానికి కూడా రాక‌పోయినా కుప్పం ప్ర‌జానీకం ఆద‌రించింది. ఇప్పుడు ల‌క్ష మెజార్టీ ఇవ్వాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జానీకాన్ని వేడుకుంటున్నారు. ఎంత…

ఏడుసార్లు కుప్పానికి చంద్ర‌బాబు ఎమ్మెల్యే. చంద్ర‌బాబుకు ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎంతో చేసింది. క‌నీసం నామినేష‌న్ వేయ‌డానికి కూడా రాక‌పోయినా కుప్పం ప్ర‌జానీకం ఆద‌రించింది. ఇప్పుడు ల‌క్ష మెజార్టీ ఇవ్వాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జానీకాన్ని వేడుకుంటున్నారు. ఎంత సేపూ త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్ప‌, తాను ఉద్ధ‌రించిందేమీ లేద‌ని ప‌రోక్షంగా చంద్ర‌బాబే చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

9 ఏళ్ల పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఐదేళ్ల పాటు విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సీఎంగా ఉండే అద్భుత అవ‌కాశాన్ని క‌ల్పించిన కుప్పం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఇంటింటికి తాగునీటి సౌక‌ర్యం కూడా క‌ల్పించలేదంటే చంద్ర‌బాబు పాల‌న ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. పైగా ల‌క్ష మెజార్టీ ఇస్తే గ‌త 35 ఏళ్ల‌లో జ‌ర‌గ‌ని అభివృద్ధిని, రానున్న ఐదేళ్ల‌లో చేసి చూపిస్తాన‌ని చెప్ప‌డం ఒక్క చంద్ర‌బాబుకే చెల్లింది.

కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే… “1989లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేసి ఉండొచ్చు. కానీ వెనుకబడిన ప్రాంతమైన కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నా. మీరూ నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.  ఈ 35 ఏళ్లలో కుప్పంలో జరిగిన ఈ అభివృద్ధిని అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో చేసి చూపిస్తా. ఇప్పుడు లక్ష్యమే లక్ష మెజారిటీ . అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ నీవా ప్రాజెక్టును పూర్తిచేసి ప్రతి ఎకరాకూ సాగునీరు, ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందిస్తాం” అని చంద్ర‌బాబు న‌మ్మ‌బ‌లికారు.

కుప్పంలో ఇంటింటికీ ర‌క్షిత మంచినీటిని కూడా ఇవ్వ‌లేద‌ని చంద్ర‌బాబు ఒప్పుకున్న‌ట్టైంది. 35 ఏళ్ల‌లో చేయ‌లేని అభివృద్ధి, రానున్న ఐదేళ్ల‌లో చేస్తాన‌ని చెబితే… బాబు మాట‌లు న‌మ్మేదెట్టా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ప‌ద‌వి కంటే, చిత్త‌శుద్ధి ముఖ్య‌మ‌ని చంద్ర‌బాబుకు తెలియ‌దా?

క‌నీసం తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికైనా ర‌క్షిత తాగునీటిని, ప్ర‌తి ఎక‌రాకు సాగునీటిని అందించాల‌న్న ఆలోచ‌న చంద్ర‌బాబుకు ఇంత కాలం రాక‌పోవ‌డ‌మే దుర్మార్గ‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం కుప్పాన్ని గాలికొదిలేసి, జ‌గ‌న్ త‌న నియోజ‌క‌వ‌ర్గంపై సీరియ‌స్‌గా దృష్టి పెట్టార‌నే భ‌యంతో ఏవేవో హామీల‌తో హ‌డావుడి చేస్తున్నారు. సొంత నియోజ‌క వ‌ర్గానికే గుక్కెడు తాగునీరు ఇవ్వ‌ని చంద్ర‌బాబు… ఇక మిగిలిన రాష్ట్ర ప్ర‌జానీకానికి ఏం చేశారో అర్థం చేసుకోవ‌చ్చు. కుప్పంలో బాబు తాజా మాట‌లు, ఆయ‌నే సిగ్గుప‌డేలా ఉన్నాయి.