టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రోజురోజుకూ బలహీనపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా జగన్ ప్రభుత్వా నికి అంటకట్టడం ఆయనకు బలహీనతగా మారింది. ప్రజావ్యతిరేక విధానాలు, దౌర్జన్యాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కేవలం విమర్శించడమే పనిగా లోకేశ్ వ్యవహార శైలి వుంటోంది. నిజంగా లోకేశ్ నాయకుడిగా తనను తాను నిరూపించుకోవాలంటే మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే సరిపోదు.
ప్రభుత్వ దమనకాండపై ప్రత్యక్ష పోరాటాలకు దిగి వాటిని ఎండగట్టాలి. బాధితులకు నేరుగా అండగా నిలిచి భరోసా ఇవ్వాలి. అప్పుడు అధికార పార్టీకి, ప్రభుత్వానికి కూడా భయం పట్టుకుంటుంది. తప్పులపై దృష్టి సారించి మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
కానీ యువకుడైన లోకేశ్ ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరాటం చేయడానికి వెనుకంజ వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవైపు తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనే తపన ఆయనలో కనిపించడం లేదు. తండ్రి చంద్రబాబు వయసు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతల్ని మోయాల్సిన లోకేశ్, ఆ పని చేయకుండా తాను కూడా భారం కావడం గమనార్హం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రాన్ని రావణకాష్టం చేయడానికి వైసీపీ అధినేత జగన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారని లోకేశ్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్యవహారాలలో ఏర్పడిన వివాదంతో వైసీపీ నేత ఎన్. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంపడం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచకాలకి పరాకాష్ట అని తీవ్ర విమర్శలు చేశారు.
జగన్‌రెడ్డి దిశ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించి మహిళల భద్రతకి నాది భరోసా అని మాయమాటలు చెప్పి మూడురోజులు కాలేదు… వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి ఓ మహిళను అత్యంత పాశవికంగా కొట్టి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ముఖ్యమంత్రి మహిళలకు మీరిచ్చే భద్రత? అని ప్రశ్నించారు. ఇదే విషయమై ఆయన నేరుగా పోరాటం చేసి వుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాయకుడిగా నిరూపించుకునేందుకు బోలెడు అవకాశాలున్నా, లోకేశ్ మాత్రం సద్వినియోగం చేసుకోవడం లేదని సొంత పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.