ఆంధ్రలో సినిమా టికెట్ రేట్ల దోపిడీకి తెరలేచిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తొలి రోజు దోచుకున్న వాడికి దోచుకున్నంత, అమ్ముకున్నవాడికి అమ్ముకున్నంత అన్నట్లు సాగిపోయింది వ్యవహారం. బెనిఫిట్ షో లు అని చెప్పి, ఫ్యాన్స్ షో లు అని చెప్పి ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్ లు అమ్మేసారు. ఎక్కడిక్కడ ఎవరి లెవెల్ లో వారు టికెట్ ల మీద సంపాదించే పనిలో పడ్డారు.
ఆంధ్రలోని ఓ కీలకమైన పట్టణంలో డిస్ట్రిబ్యూటర్ నే టికెట్ లు మొత్తం తన ఆఫీసుకు తెప్పించుకుని, బ్లాక్ రేట్లకు అమ్మేయడం విశేషం. ఇలాంటి వ్యవహారం తొలిసారి చూస్తున్నామని ఆ ‘పట్టణం’ డిస్ట్రిబ్యూటర్లు ‘గ్రెేట్ ఆంధ్ర’ తో అనడం విశేషం. థియేటర్ల బ్లాక్ చేయడం వేరు, డిస్ట్రిబ్యూటర్ నే బ్లాక్ చేయడం, అమ్మడం తొలిసారి చూస్తున్నామని వారు అన్నారు.
విజయవాడలోని ఓ మాల్ లో చిత్రమైన వ్యవహారానికి తెరతీసారు. టికెట్ కావాలంటే ఫుడ్ ప్యాకేజీ తీసుకోవాల్సిందే. టికెట్ ఖరీదు 800. ఇందులో అసలు టికెట్ రేటు 236 రూపాయలు మాత్రమే. ఆ టికెట్ కు ఫుడ్ కూపన్ జతచేసి అమ్మేసారు. అంటే 550 అదనంగా తీసుకుని కోక్, పాప్ కార్న్ ఇచ్చారు. ఈ మాల్ కు వైకాపాతో సంబంధాలున్నాయనే టాక్ వుంది. దాంతో అధికారులు ఏమీ చేయలేకపోయారు.
చాలా చోట్ల వైకాపా చోటా మోటా నాయకులు తమ పలుకుబడి ఉపయోగించి టికెట్ లు తీసుకుని బ్లాక్ లో విక్రయించారని ఆరోపణలు వున్నాయి. చేస్తున్నది వైకాపా నాయకులు కావడంతో అధికారులు మౌనం వహించాల్సి వచ్చింది.
మొత్తం మీద ఏ సినిమా టికెట్ లు పేదవాడికి అందుబాటులో వుండాలని సిఎమ్ జగన్ అనుకున్నారో, అది మాత్రం పూర్తిగా గాలికి కొట్టుకుపోయినట్లే.