కామెడీ క్యారెక్ట‌ర్ ట్రై చేయ‌క‌పోయావా?

కామెడీ చేయ‌డంలో నారా లోకేశ్ రోజురోజుకూ రాటుతేలుతున్నారు. మామ బాల‌య్య సినిమాలో కామెడీ క్యారెక్ట‌ర్ ట్రై చేయ‌క పోయావా లోకేశ్ అని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ గురించి లోకేశ్ నీతులు మాట్లాడితే…

కామెడీ చేయ‌డంలో నారా లోకేశ్ రోజురోజుకూ రాటుతేలుతున్నారు. మామ బాల‌య్య సినిమాలో కామెడీ క్యారెక్ట‌ర్ ట్రై చేయ‌క పోయావా లోకేశ్ అని నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ గురించి లోకేశ్ నీతులు మాట్లాడితే అవేవో వేదాలు చెప్పిన చందంగా ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టీడీపీ పాల‌నా పుణ్య‌మా అని ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న‌కు దారి తీసింద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

1983 నుంచి ఉమ్మ‌డి ఏపీని అత్య‌ధిక కాలం పాలించిన పార్టీగా టీడీపీ ఘ‌న‌త సాధించింది. హైద‌రాబాద్‌లో సొంత సామాజిక వ‌ర్గం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్ర‌బాబు చేసిన అభివృద్ధి చివ‌రికి రాష్ట్ర విభ‌జ‌న‌కు దారి తీసింద‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. అలాంటి టీడీపీ వ‌ల్లే అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ సాధ్య‌మ‌ని ఆ పార్టీ భ‌విష్య‌త్ ర‌థ‌సార‌థి నారా లోకేశ్ చెప్ప‌డం విశేషం.

నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ పాల‌నా వికేంద్రీక‌ర‌ణ కాద‌ని, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని కోరారు. అభివృద్ధి వికేంద్రీ క‌ర‌ణ టీడీపీతోనే సాధ్య‌మ‌న్నారు. పరిపాలనా విభాగాన్ని ఒకేచోట ఉంచి.. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్య మన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతిచ్చి.. ఇప్పుడు కాదనడం మోసం కాదా? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేనివాళ్లు మూడు రాజధానులు కడతారా? అంటూ దెప్పి పొడిచారు.

క‌ర్నూలులో క‌నీసం హైకోర్టు అయినా ఏర్పాటు చేయాల‌ని ఆ ప్రాంత ఆకాంక్ష‌ల‌ను నిర్ద‌య‌గా అణ‌చివేసిన ఘ‌న‌త టీడీపీకి ద‌క్క‌దా? అనంత‌పురంలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్‌ను అమ‌రావ‌తికి త‌ర‌లించ‌డం కూడా అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌లో భాగ‌మేనా అని సీమ స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. రాయ‌ల‌సీమ‌తో పాటు నెల్లూరు జిల్లా వాసుల‌కు అత్య‌ధికంగా ద‌క్కాల్సిన మెడిసిన్ సీట్ల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు పంపిణీ చేస్తూ జీవో 120 జారీ కూడా అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌లోకే వ‌స్తుందా అని లోకేశ్‌ను సీమ స‌మాజం నిల‌దీస్తోంది. 

వెనుకబ‌డిన రాయ‌ల‌సీమ‌కు క‌నీసం ఒక పంట పండించుకోడానికైనా నీళ్లు ఇవ్వాల‌ని కోరితే, కాదంటూ ప‌ట్టిసీమ‌ను నిర్మించి మూడు పంట‌లు పండుతున్న వాళ్ల‌కు నీళ్లు అందించ‌డం నిజం కాదా? అని సీమ స‌మాజం ప్ర‌శ్నిస్తోంది. ఇదేనా టీడీపీకి చేత‌నైన అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అని సీమ ఉద్య‌మ‌కారులు నిల‌దీస్తున్నారు.