పవన్ కళ్యాణ్ లోని తెలివైన అమాయకత్వం?

పిచ్చివాడు తానొక్కడూ కరెక్ట్ గా ఉన్నాడని, లోకంలో ఉన్న మిగిలిన వాళ్లంతా పిచ్చోళ్ళయ్యారని అనుకుంటాడట. అలాగే ఒక అమాయకుడు..తాను మాత్రమే తెలివైన వాడినని..లోకంలో ఉన్న అమాయకులందర్నీ మాస్ హిప్నాటిజం చేయగలనని అనుకోవచ్చేమో. పవన్ కళ్యాణ్…

పిచ్చివాడు తానొక్కడూ కరెక్ట్ గా ఉన్నాడని, లోకంలో ఉన్న మిగిలిన వాళ్లంతా పిచ్చోళ్ళయ్యారని అనుకుంటాడట. అలాగే ఒక అమాయకుడు..తాను మాత్రమే తెలివైన వాడినని..లోకంలో ఉన్న అమాయకులందర్నీ మాస్ హిప్నాటిజం చేయగలనని అనుకోవచ్చేమో. పవన్ కళ్యాణ్ ఆ బాపుతు మనిషే అని చెప్పడానికి ఒక నిదర్శనం దొరికింది. 

తాను మొన్నటి వరకు తాను సీయం అభ్యర్థిని కాదని నొక్కి వక్కాణించాడు. అదేంటో కానీ ఇప్పుడు కొత్తగా “నేనే సీయం” నినాదం ఎత్తుకున్నాడు. అంటే జనం మొన్న చెప్పింది మరిచిపోయి ఇవాళ చెప్పిందానికి కనెక్ట్ అయిపోతారనా? ప్రజల్ని మరీ అంత అజ్ఞానవాసులనుకుంటున్నాడా? 

ఇదొక కామెడీ అయితే మరొకటుంది. 

మనదేశంలో ఎవరూ దొరకనట్టు ఎక్కడో క్యూబాకు చెందిన చెగువేరా ఫోటో పెట్టుకుని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా యజ్ఞాలు, యాగాలు చేసాడు. చెగువేరాలో ఉన్న విప్లవమేంటి… చేస్తున్న యాగాలేంటి?

పీడిత కులాల ప్రతినిధినంటూ కబుర్లేంటి…అప్పుడెప్పుడో ఒడుగు చేయించుకుని, జంధ్యం వేసుకుని బ్రాహ్మణత్వం స్వీకరించిన తీరేంటి? 

ఈ కాంట్రాస్టులన్నీ చూస్తుంటే “పాపం” అని జాలి చూపించాల్సి వస్తుంది తప్ప ఏ రకంగానూ మురిసిపోవాలనిపించదు. అస్సలు నిలకడలేని తనం, ఎప్పుడు ఏది తోస్తే అది చేయడం, లోలోపల ఏదో భయం…పైకి మాత్రం తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో ఏవో స్టేట్మెంట్స్ ఇవ్వడం…ఇవన్నీ అమాయకత్వపు చేష్టలు తప్ప ఇంకేంటి!

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మర్చిపోకుండా ఫాలో అయ్యే సూత్రమొకటుందని..దాని పేరు “నో స్పెండింగ్ పాలసీ” అని ఒక ఆంతరంగికుడు చెప్పాడు. అదేంటంటే రాజకీయపరంగా ఏ ప్రెస్మీట్ పెట్టాలన్నా, యాత్రలు చెయ్యాలన్నా, ప్రయాణ-వసతి వ్యవహారాలు చూడాలన్నా, తనకే కాకుండా తన మంది మార్బలానికి జీతభత్యాలు వగైరాలు ఇవ్వాలన్నా ఆ ఖర్చులు చంద్రబాబు భరించేవాడట. అది చాలాకాలం కొనసాగింది. అయితే ఎప్పుడైతే లోకేష్ పాదయాత్ర సైడైపోకూడదని పవన్ ని తెదేపా అధిష్టానం పక్కన పెట్టిందో, ఎప్పుడైతే అతిగా ప్రొమోషన్ ఇస్తే ఏకు మేకై తెదేపాని పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు అడుగుతాడని పచ్చ మీడియా కూడా భావించి పక్కన పెట్టిందో…కథ మార్చాల్సొచ్చింది. 

ఇలా చంద్రబాబు కనికరించేవరకూ కూర్చుంటే జనసేన కాలగర్భంలో కలిసిపోతుందని, తానే స్వయంగా బరిలోకి దిగి తన సత్తా చాటుకోవాలని కొందరు పక్కనున్నవాళ్లు పవన్ కి సూచించారట. మరి ఖర్చుల సంగతేంటని అమాయకంగా అడిగితే..దానికి కూడా లాస్ట్ మినిట్ లో ఎవరో సలహా చెప్పారట. అందుకే రాత్రికి రాత్రి తన నిర్మాతలకి ఫోన్ చేసి వారాహి పూజకి రమ్మన్నాడని…నిర్మాతలంతా పొద్దున్నే లేచి పరుగెత్తుకెళ్లారని టాలీవుడ్లో టాక్. 

తన సినీ మిత్రుల్ని పిల్చాడా అనుకుంటే దర్శకుల్ని కూడా పిలవాలి కదా. కేవలం నిర్మాతల్నే పిలవడం వెనుక ఆంతర్యం ఏమిటంటే తాము మాత్రమే తనకి పనికొచ్చే స్పాన్సర్లు కాబట్టి. ప్రతి నిర్మాత వంద కోట్లు పైగా ఖర్చుపెట్టి తనతో సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఖర్చులో భాగంగా తలొక యాభై లక్షలో, ఒకటి రెండు కోట్లో కాస్త అటుఇటుగా సర్దమన్నట్టు వినికిడి. ఇదే నిజమైతే “పాపం నిర్మాతలు” అని కూడా అనుకోవాలి. 

అయితే ఇక్కడొక ప్రమాదం లేకపోలేదు. వీళ్లు అడిగినప్పుడల్లా నిర్మాతలు ఇస్తూ పోతుంటే ఇప్పట్లో వీళ్ల సినిమాలు పవన్ పూర్తిచేయడు పవన్. ఒకసారి హీరో-నిర్మాత అనే బంధం అయిపోతే చిల్లర రాలకపోవచ్చు. అందుకే ఆ బంధాన్ని ఎన్నికలయ్యేదాకా కొనసాగించవచ్చు.

ఎలా చూసుకున్నా పబ్లిక్ స్పీకింగ్ లో అమాయకత్వం, పైన విషయం నిజమనుకుంటే డబ్బు విషయంలో పీనాసితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి పవన్ లో. 

తనకి టీడీపీయో, బీజేపీయో, నిర్మాతలో ఖర్చులు భరిస్తేనే రాజకీయరంగంలో తన ప్రతిభ చూపిస్తాడు…లేకపోతే లేదు అన్నట్టుగా ఉంది ఇదంతా చూస్తుంటే. ఇలాంటి వాడిని నమ్ముకుని ముందుకెళ్తున్న జనసైనికుల్ని కూడా “పాపం” అనుకోవడం తప్ప ఇంకేమీ చెయ్యలేం. 

చంద్రబాబుకి ఎలాగూ తెలుసు… ఎంత లేదనుకున్నా 175 స్థానాల నుంచి సోలోగా పోటీ చేసే ధైర్యం, ఆర్ధిక స్థైర్యం రెండూ పవన్ కి లేవు కనుక తోకూపుకుంటూ తన వద్దకే వస్తాడని, అప్పుడు ఏ ఐదో పదో సీట్లు మొహాన కొట్టొచ్చని చూస్తున్నట్టు భోగట్టా. 

కానీ పవన్ మాత్రం బెట్టు చేసి, తన స్వయం ప్రతిభ చాటుకుని, సీబీయన్ ఖర్చులు భరించకపోయినా అవి భరించడానికి తన దగ్గర మనుషులున్నారని చాటుకుని చంద్రబాబుని బెదరగొట్టాలనె తెలివైన అమాయకత్వం కూడా ఉందట పవన్ లో. 

పవన్ ని పొత్తులో కలుపుకోకుండా చంద్రబాబు 175 స్థానాల్లోనూ పోటీ చేస్తే తెదేపాకే ప్లస్సు. జనసేనకి ఎలాగూ 175 స్థానాల్లో పోటీ చేసే సత్తా లేదు కనుక పూర్తిగా సీన్లోంచి పోతుంది. అప్పుడు పోటీ వైకాపా, తెదేపా మధ్యలోనే ఉంటుంది. అంతే తప్ప పవన్ ని కలుపుకోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో తెదేపాకి ఒనగూరేది ఏమీ ఉండదు. తెదేపా-జనసేన పొత్తులో పవన్ సీయం అభ్యర్థి కాదని తానే ప్రకటించేసుకున్నాక జనసేన ఓట్లు తెదేపాకి మాత్రం పడవు. “నేనే సీయం” అని అరిచినా కూడా జనం నవ్వి పోతారు తప్ప నమ్మి ఓటేసేటంత అమాయకులైతే కాదు. 

– శ్రీనివాసమూర్తి