గిడుగు: మబ్బుల్లో నీళ్లు చూసి…

మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకోవడం ఒక రకం! కానీ మబ్బుల్లో నీళ్లు చూసి అప్పుడే దుక్కులు దున్నినట్లుగా, పొలం తడిచినట్టుగా, పంట పండినట్టుగా, దిగుబడి వచ్చినట్టుగా ముందే పండగ చేసుకుంటే ఎలాగ? ఇప్పుడు…

మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకోవడం ఒక రకం! కానీ మబ్బుల్లో నీళ్లు చూసి అప్పుడే దుక్కులు దున్నినట్లుగా, పొలం తడిచినట్టుగా, పంట పండినట్టుగా, దిగుబడి వచ్చినట్టుగా ముందే పండగ చేసుకుంటే ఎలాగ? ఇప్పుడు ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథి గిడుగు రుద్రరాజు మాటలు చూస్తే అలాగే అనిపిస్తోంది. 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని గిడుగు రుద్రరాజు అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెసు పార్టీ పూర్తిస్థాయిలో శవాసనం వేసినప్పటికీ.. ‘ప్రభంజనం సృష్టిస్తాం’ అనే పెద్దమాట అనగలిగేంత ధైర్యం పీసీసీ చీఫ్ కు ఎలా వచ్చిందో తెలుసా? 

తమ అధినాయకుడు రాహుల్ గాంధీ అమెరికాలో నిర్వహించిన యాత్ర విజయవంతం అయిందట. అందుకని.. ఆయన ఏపీలో తమ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని అంటున్నారు. ఏపీలో రాహుల్ గాంధీ కార్యక్రమాలకు తెలుగు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారట. కాబట్టి.. ఇలాంటి అంచనాలు వేస్తున్నారు.

గిడుగు రుద్రరాజు అమాయకత్వం చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. అమెరికాలో కార్యక్రమాలకు భారతీయులు/తెలుగు ప్రజలు గుమికూడడం అనేది ఎప్పటికీ కూడా బలానికి సంకేతం కానే కాదు. ఎందుకంటే.. వారు సరదాగా కలవడానికి ఒక అవకాశం దొరికితే చాలు, కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతే తప్ప.. ఆ వచ్చే నాయకుడి మీద ప్రేమగానీ, అభిమానం వెల్లువగానీ ఉంటుందని అనుకోవడం భ్రమ. 

ఇదొక అంశం కాగా- రాహుల్ సభలకు తెలుగువారు చాలా ఎక్కువగా వచ్చారనే మాట గిడుగు ఎలా చెప్పగలుగుతున్నారు. ఎన్నారైలలో తెలుగు వారికి సంబంధించిన డేటాబేస్ ఏమైనా ఆయన వద్ద ఉన్నదా? దానితో సరిపోల్చుకుని ఇలాంటి నిర్ణయానికి వచ్చారా? అనేది రెండో సందేహం. అలాగే, తెలుగు ప్రజలు ఎక్కువగానే వచ్చి ఉండొచ్చు. అయితే వారంతా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న తెలంగాణ వాసులు అయి ఉండొచ్చు కూడా. అలాంటిది గిడుగు మాత్రం ఏపీలో ప్రభంజనం అంటున్నారు.

చూడబోతే రాష్ట్రంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే గెలవబోతున్నాం అనే మాట ప్రతి పార్టీ వారూ అనేస్తున్నారు. ఇంతమంది ఇలా హడావుడి చేస్తుండగా.. వీరందరికంటె సీనియర్ పార్టీ అయిఉండి, తాము ఏమీ అనకపోతే బాగుండదని, గిడుగు ఈ ప్రకటన చేసినట్టుగా ఉంది. ఆయన మాటలను ప్రజలు ఎటూ సీరియస్ గా తీసుకోరు. 

కనీసం ఆయనైనా సీరియస్ గా తీసుకుంటున్నట్టు నిరూపించుకోవాలంటే.. ఈసారి నుంచి ప్రభంజనం లాంటి పెద్ద పదాలు వదలేసి.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలుస్తుంది, నెమ్మదిగా పూర్వవైభవం వస్తుంది లాంటి మాటలు చెబితే పరువు పోకుండా ఉంటుంది.