తిరుపతి ఉప ఎన్నిక బరిలో ఎట్టి పరిస్థితుల్లో తామే ఉంటామని బీజేపీ మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దాని మిత్రపక్షమైన జనసేన తక్షణ కర్తవ్యం ఏంటనేది తెలియాల్సి ఉంది.
తిరుపతి ఉప ఎన్నికలో ఎవరు నిలవాలనే విషయమై ఓ కమిటీ తేలుస్తుందని, అంత వరకూ ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమని ఇంత వరకూ జనసేన నాయకులు చెబుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 21న తిరుపతిలో జనసేన కీలక సమావేశం కూడా జరపనున్నట్టు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు.
అయితే బీజేపీ నేతలు మాత్రం జనసేనను ఏ మాత్రం పరిగణలోకే తీసుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా విశాఖ శివారు రుషికొండలో దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు జనసేనను అవమానపరిచేలా ఉన్నాయని చెప్పక తప్పదు.
ఒకవైపు తిరుపతిలో జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉంటారని బీజేపీ నేతలు పైకి చెబుతున్నప్పటికీ, లోలోపల మాత్రం అధికారికంగా తామే నిలుస్తున్న భావనతో ఏర్పాట్లను చురుగ్గా చేసుకుపోతుండడం గమనార్హం.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అభ్యర్థి గెలవాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులన్నీ అక్కడ పనిచేయాలని ఆ పార్టీ కోర్ కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి మండలానికి ఒక బృందాన్ని పంపాలని, కీలక వ్యక్తులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
ఎన్నికలు పూర్తయ్యేవరకు అంతా అక్కడే ఉండాలని నిర్ణయించడం గమనార్హం. కేవలం పార్టీ అభ్యర్థి ప్రకటన మాత్రమే మిగిలింది. తమను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా తిరుపతి ఉప ఎన్నికపై నిర్ణయాలన్నీ తీసుకుంటూ అవమానిస్తున్న బీజేపీ వైఖరిపై జనసేన రియాక్షన్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.