జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ఆయన పాతమిత్రుడు ఫైర్ అయ్యారు. ఒకే ఒక్క మాటతో పవన్ గాలి తీశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామపక్షాలతో జనసేనాని పవన్‌కల్యాణ్ చెట్టపట్టాలేసుకుని ఊరూరా తిరిగిన సంగతి తెలిసిందే.
అప్పట్లో చేగువేరా గురించి పవన్ పదేపదే చెబుతున్న కాలం. దీంతో పవన్‌లో ఓ గొప్ప కమ్యూనిస్టు నాయకుడు వామపక్షాల నేతలకు కనిపించేవారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చివరికి తాను నిలిచిన రెండు చోట్ల కూడా పవన్‌కల్యాణ్ ఓడిపోయిన దుస్థితి.
ఎన్నికల తర్వాత కొన్ని రోజులకే వామపక్షాలకు పవన్‌కల్యాణ్ విడాకులు ఇచ్చారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన పాత మిత్రపార్టీ అయిన బీజేపీతో పవన్ జత కట్టారు. ఈ నేపథ్యంలో పవన్‌లో కమ్యూనిజం పోయి, కాషాయిజం వచ్చి చేరింది.
ఈ నేపథ్యంలో జనసేనాని పవన్‌కల్యాణ్‌పై పాత మిత్రుడైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తాజాగా విమర్శలు గుప్పించారు. పవన్‌కల్యాణ్ బీజేపీ పంచన చేరి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. పవన్, బీజేపీ నేతల నంగనాచి మాటలు విని ప్రజలు మోసపోవద్దని ఆయన పిలుపునిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ లేబొరేటరీస్ ఏర్పాటును బీజేపీ ఏపీలో వ్యతిరేకిస్తూ, ఢిల్లీలో మాత్రం మద్దతు పలుకుతోందని విరుచుకుపడ్డారు. దివీస్ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇటీవల దివీస్‌ను తరలించాలనే డిమాండ్‌తో పవన్‌కల్యాణ్ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో సీపీఎం నేత విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.