బాల నటుడిగా నటించిన రాజమౌళి

రాజమౌళి దర్శక ధీరుడు అనే విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన సంగతి కూడా తెలిసిందే. అయితే రాజమౌళి ఓ నటుడు అనే విషయం తెలుసా? అతడు చిన్నప్పుడే…

రాజమౌళి దర్శక ధీరుడు అనే విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి ఫ్రాంచైజీతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన సంగతి కూడా తెలిసిందే. అయితే రాజమౌళి ఓ నటుడు అనే విషయం తెలుసా? అతడు చిన్నప్పుడే బాలనటుడిగా నటించిన విషయం తెలుసా? ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి వెల్లడించాడు.

“అవును.. నేను కూడా నటించాను. ఓ సినిమాలో బాలనటుడిగా నటించాను. ఆ సినిమా పేరు పిల్లన గ్రోవి. 1983లో ఆ సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు నాకు పదేళ్లు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సినిమా విడుదల కాలేదు.”

ఇలా తను బాలనటుడిగా నటించిన విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. బహుశా ఆ సినిమా విడుదలై తనకు పేరొచ్చి ఉంటే, తన కెరీర్ మరో విధంగా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు జక్కన్న. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా ఈ ఇంట్రెస్టింగ్ మేటర్ ను బయటపెట్టాడు.

ప్రచారంలో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య చిన్న సరదా డిస్కషన్ నడిచింది. “నేను సీనియర్ అంటే నేను సీనియర్” అంటూ ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. నువ్వు సినిమాల్లోకి రాకముందే నేను సీరియల్ డైరక్టర్ ను అంటూ రాజమౌళి చెప్పడంతో, అంతకంటే ముందే నేను బాలనటుడిగా నటించానని ఎన్టీఆర్ కౌంటర్ వేశాడు. ఆ వెంటనే రాజమౌళి స్పందిస్తూ, నీ కంటే ముందే నేను నటుడ్ని అంటూ ఈ 'పిల్లనగ్రోవి' సీక్రెట్ ను బయటపెట్టాడు.

మొత్తమ్మీద ఆర్ఆర్ఆర్ ప్రచారంతో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలు బయటకొస్తున్నాయి. పనిలోపనిగా వాళ్ల మధ్య ఉన్న బాండింగ్ కూడా అందరికీ తెలిసొచ్చింది.