టీడీపీలో 100 మంది అభ్య‌ర్థుల ఖ‌రారు!

చంద్ర‌బాబు అంటే నాన్చివేత‌కు, జాప్యానికి మారుపేరు. అలాంటి చంద్ర‌బాబు మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా తాను కూడా మారారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉండ‌గానే టీడీపీ మానిఫెస్టోను చంద్ర‌బాబు…

చంద్ర‌బాబు అంటే నాన్చివేత‌కు, జాప్యానికి మారుపేరు. అలాంటి చంద్ర‌బాబు మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా తాను కూడా మారారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉండ‌గానే టీడీపీ మానిఫెస్టోను చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మాదిరిగానే తాను కూడా సంక్షేమ పాల‌న తీసుకొస్తాన‌ని, న‌మ్మాల‌ని ఆయ‌న కోరారు. ఇక అభ్య‌ర్థుల ఎంపిక‌పై కూడా ఆయ‌న తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

టీడీపీ అధిష్టానం పెద్ద‌ల నుంచి అందుతున్న స‌మాచారం మేర‌కు… ఇప్ప‌టికి 100 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు. నాలుగైదు సంస్థ‌ల‌తో స‌ర్వే చేయించి అభ్య‌ర్థుల ఎంపిక‌పై నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పాద‌యాత్ర‌లో భాగంగా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నారా లోకేశ్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డాన్ని చూడొచ్చు.

అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన నియోజ‌క‌వ‌ర్గంలో రెండో నాయ‌కుడు టికెట్ త‌న‌కూ అంటూ తిర‌గ‌కూడ‌ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాల‌ను చంద్ర‌బాబు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల‌కు ముందుగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌డం వ‌ల్ల‌, అస‌మ్మ‌తి బెడ‌ద త‌క్కువ‌గా వుంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని స‌మాచారం. ఇందులో భాగంగానే ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే ముఖ్య నాయ‌కుల‌కు కూడా సీట్ల విష‌య‌మై క్లారిటీ ఇస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, అలాగే వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయ‌ణ‌రెడ్డికి కూడా సీట్ల‌ను ఖ‌రారు చేయ‌డంతో పాటు మ‌రెవ‌రూ వారి స్థానాల్లోకి వెళ్ల‌కూడ‌ద‌ని దిశానిర్దేశం చేసిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతెందుకు స‌త్తెన‌ప‌ల్లిలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, చిల‌క‌లూరిపేట‌లో భాష్యం ప్ర‌వీణ్ త‌దిత‌రుల‌కు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం విశేషం.

జ‌న‌సేన‌తో పొత్తు ఉండ‌నున్న నేప‌థ్యంలో కొన్ని సీట్ల‌ను రిజ‌ర్వ్‌లో పెట్టిన‌ట్టు స‌మాచారం. ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తి, చిత్తూరు, విజ‌య‌వాడలోని ఒక‌ట్రెండు నియోజ‌క‌వ‌ర్గాలు, ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ‌గా రిజ‌ర్వ్‌లో పెట్టిన‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి టీడీపీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. గెలుపోట‌ముల‌ను ప‌క్క‌న పెడితే, అభ్య‌ర్థుల ఎంపిక‌లో చంద్ర‌బాబు చూపుతున్న చొర‌వ సొంత పార్టీ నేత‌ల్ని సైతం విస్మ‌యానికి గురి చేస్తోంది.