విడ‌ద‌ల ర‌జినీకి కొత్త ప్ర‌త్య‌ర్థి!

ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో మంత్రి విడ‌ద‌ల ర‌జినీకి ప్ర‌త్య‌ర్థి మార‌నున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో నాటి మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌త్తిపాటి పుల్లారావును మ‌ట్టిక‌రిపించి, రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని విడ‌ద‌ల ర‌జినీ ఆక‌ర్షించారు.…

ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట‌లో మంత్రి విడ‌ద‌ల ర‌జినీకి ప్ర‌త్య‌ర్థి మార‌నున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో నాటి మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ప‌త్తిపాటి పుల్లారావును మ‌ట్టిక‌రిపించి, రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని విడ‌ద‌ల ర‌జినీ ఆక‌ర్షించారు. జ‌గ‌న్ రెండో కేబినెట్‌లో ర‌జినీ బెర్త్ ద‌క్కించుకున్నారు. చిన్న వ‌య‌సులోనే అమాత్య ప‌ద‌వి ద‌క్కించుకున్న ఎమ్మెల్యేగా విడ‌ద‌ల ర‌జినీ గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, కీల‌క‌మైన వైద్యారోగ్య‌శాఖ మంత్రిత్వ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. అయితే మంత్రి ప‌ద‌వి మాత్ర‌మే ఆమెకు, ప‌వ‌ర్స్ మాత్రం సీఎం వైఎస్ జ‌గ‌న్ వ‌ద్దే అని వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో రానున్న ఎన్నిక‌లు అత్యంత కీల‌కంగా మారాయి. చిల‌క‌లూరిపేట‌లో గెల‌వ‌డం విడ‌ద‌ల ర‌జినీకి పెద్ద స‌వాల్‌గా మారింది. ముఖ్యంగా సొంత వాళ్ల నుంచే ఆమె వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే ర‌జినీపై ప‌ల్నాడు కోఆర్డినేట‌ర్లు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, బీద మ‌స్తాన్‌రావుల‌కు చిల‌క‌లూరిపేట వైసీపీ నేత‌లు ఫిర్యాదులు చేశారు. త‌న‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ర‌జినీ మాత్రం ఖాత‌రు చేయ‌డం లేదు. ఎందుకంటే త‌న‌కే టికెట్ అనే ధీమా ఆమెలో క‌నిపిస్తోంది.

మ‌రోవైపు టీడీపీలో అదే ప‌రిస్థితి. చిల‌క‌లూరిపేట టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావుకు టీడీపీ ఎస‌రు పెట్టింది. ఆయ‌న ప్లేస్‌లో భాష్యం ప్ర‌వీణ్‌ను బ‌రిలో దింపేందుకు సిద్ధ‌మైంది. నారా లోకేశ్ స‌న్నిహితుడిగా వ్యాపార‌వేత్త అయిన భాష్యం ప్ర‌వీణ్ చిల‌క‌లూరిపేట‌లో రాజ‌కీయంగా అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. త‌న నాయ‌క‌త్వానికి ప్ర‌మాదం ఎదురు కావ‌డంతో పుల్లారావు టీడీపీ అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు.

ఇటీవ‌ల భాష్యం ప్ర‌వీణ్‌ను ప్రోత్స‌హిస్తున్న అధిష్టానం పెద్ద‌ల‌పై పుల్లారావు విమ‌ర్శ‌లు చేశారు. దీంతో పుల్లారావును పిలిపించుకున్న చంద్ర‌బాబు గ‌ట్టిగా క్లాస్ తీసుకున్న‌ట్టు స‌మాచారం. టీడీపీ అధికారంలోకి రావాల‌ని కోరుకుంటూనే, మీరు ఓడిపోయే ప‌రిస్థితి ఉన్నా టికెట్ కావాలంటే ఎలా? మ‌రోసారి విమ‌ర్శ‌ల‌కు దిగితే పార్టీ నుంచి బ‌య‌టికి పంపుతాన‌ని వార్నింగ్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. దీంతో పుల్లారావు నోర్మూసుకున్నారు. 

జూలైలో భాష్యం ప్ర‌వీణ్‌ను చిల‌క‌లూరిపేట టీడీపీ అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌నున్నారు. కొత్త అభ్య‌ర్థిని ఎదుర్కోడానికి విడ‌ద‌ల ర‌జినీ ఎలాంటి వ్యూహం ర‌చిస్తారో చూడాలి. క‌నీసం ఇప్ప‌టికైనా సొంత పార్టీ కేడ‌ర్‌కు ప‌నులు చేయ‌డంపై ర‌జినీ దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం వుంది.