జనసైనికుల బాధ.. పగోడికి కూడా వద్దు

పవన్ కల్యాణ్ అభిమానులు వేరు, జనసైనికులు వేరు. పవన్ అభిమానుల సంఖ్య కోట్లలో ఉండొచ్చు. కానీ జనసేనానికి, అతడి పార్టీకి అభిమానులు మాత్రం లక్షలకే పరిమితం. అందులోనూ పార్టీకి ఓటేసేవారి సంఖ్య ఇంకా తక్కువ. …

పవన్ కల్యాణ్ అభిమానులు వేరు, జనసైనికులు వేరు. పవన్ అభిమానుల సంఖ్య కోట్లలో ఉండొచ్చు. కానీ జనసేనానికి, అతడి పార్టీకి అభిమానులు మాత్రం లక్షలకే పరిమితం. అందులోనూ పార్టీకి ఓటేసేవారి సంఖ్య ఇంకా తక్కువ. 

ఈ గ్యాప్ ను పూడ్చడానికి జనసైనికులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. తాజాగా వకీల్ సాబ్ టీజర్ తో మరోసారి అలాంటి విశ్వప్రయత్నమే చేస్తున్నారు జనసేన కార్యకర్తలు.

పండగ వేళ విడుదలైన వకీల్ సాబ్ టీజర్ ను ట్యాగ్ చేస్తూ, అందులోని స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ.. జనసేన వైపుకి పవన్ ఫ్యాన్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. కానీ అది వృధా ప్రయాస అనే విషయం మాత్రం వాస్తవం. 

ఎందుకంటే పవన్ కల్యాణ్ ని ఎలా చూడాలో, ఎక్కడ పెట్టాలో జనం ఇదివరకే ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా ఫ్యాన్స్ అతడిని సినిమా దైవంగా ఆరాధిస్తారు కానీ, రాజకీయ నాయకుడిగా మాత్రం గుర్తించరు. అసలా ఆలోచనే వారి మనసులోకి రానీయరు.

పోనీ పవన్ కల్యాణ్ సంగతి పక్కనపెడదాం. మెగాస్టార్ చిరంజీవికి అభిమాని కానివారెవరైనా తెలుగు రాష్ట్రాల్లో ఉంటారా..? అలాంటి చిరంజీవే తన సొంత ప్రాంతం పాలకొల్లులో బాల్చీ తన్నేశారు. అలానే ఉంటుంది సినీ అభిమానం. అది సినిమా థియేటర్లలో క్యూలైన్ వరకే పరిమితం. పోలింగ్ బూత్ ముందు క్యూలైన్ లో ఆ అభిమానం అస్సలు కనిపించదు.

ఈ విషయంలో పవన్ కల్యాణ్ అయినా అంతే. పవన్ కల్యాణ్ వస్తున్నారంటే ఎగబడి వస్తారు జనం, సినిమా కార్యక్రమం అయినా, పార్టీ కార్యక్రమం అయినా పవన్ ని చూడటానికి ఎక్కడలేని ఆసక్తి చూపిస్తారు. అలాంటి జనం జనసేనాని అంటే మాత్రం ఎవరని ప్రశ్నిస్తారు. వారికి పవర్ స్టార్, పొలిటికల్ స్టార్ మధ్య ఉన్న సన్నని గీత బాగా తెలుసు. అందుకే గీతకు ఆ గట్టునే ఉంటారు కానీ ఈ గట్టుకి రానే రారు.

“మీరంతా సినిమాలు చూస్తారు, సీఎం సీఎం అంటారు, ఓట్లు మాత్రం వేయరు” అని పవన్ పదే పదే తన ప్రసంగాల్లో చెప్పడానికి కారణం అదే. అభిమానులందర్నీ జనసైనికులుగా మార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పవన్. అలాంటి వారందర్నీ ఏకం చేస్తే పవన్ కి తిరుగులేని మెజార్టీ ఖాయం. అందుకే జనసేన తరపున ఆ ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. వకీల్ సాబ్ టీజర్ లో స్క్రీన్ షాట్స్ కు తమదైన వ్యాఖ్యానాలు జోడిస్తూ.. పార్టీవైపు అభిమానుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా వకీల్ సాబ్ ను పూర్తిస్థాయిలో భుజానికెత్తుకుంది జనసేన. పార్టీ సోషల్ మీడియా విభాగం తరపున కూడా సినిమాని మోసేస్తోంది. సినిమా వేరు, పార్టీ వేరు అనే భావాన్ని తొలగించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. అభిమానుల్ని పార్టీ వైపు రప్పించేందుకు జనసైనికులు పడుతున్న బాధ, నిజంగా పగోడికి కూడా వద్దు అనేలా ఉంది. 

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

మంచి కిక్‌ ఇచ్చారు