అరిగిపోయిన రికార్డు ప్లే చేస్తున్న కేసీఆర్!

కేసీఆర్ స్వతహాగా మాటల మాంత్రికుడు. కేవలం మాటలతోనే తిమ్మిని బమ్మిని చేయగల చాతుర్యం ఉన్న నాయకుడు. ప్రస్తుతం, ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తూ చురుగ్గా ప్రతిరోజూ ఏదో ఒక…

కేసీఆర్ స్వతహాగా మాటల మాంత్రికుడు. కేవలం మాటలతోనే తిమ్మిని బమ్మిని చేయగల చాతుర్యం ఉన్న నాయకుడు. ప్రస్తుతం, ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తూ చురుగ్గా ప్రతిరోజూ ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటున్న కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థుల మీద నిప్పులు కురిపిస్తున్నారు. 

తెలంగాణలో భారాసకు మాత్రమే ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో తనకు తోచినదెల్లా ప్రతిచోటా చెబుతున్నారు. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన సంగతి ఏంటంటే.. కేసీఆర్ ఏ ఊరికి వెళ్లినా, ఏ సభలో మాట్లాడుతున్నా.. అరిగిపోయిన గ్రాంఫోను రికార్డులాగా.. ఒకటే విషయాలను చెబుతున్నారనేది ఒక పరిశీలన. జనానికి చిరాకు పుడుతుందనే అభిప్రాయం కూడా కలగకుండా రోజూ మాట్లాడుతున్న పాచిపోయిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పడం జరుగుతోంది.

ఏపీ, ధరణి, బంగాళాఖాతం అనే పదాలు లేకుండా కేసీఆర్ ప్రసంగం సాగుతుందని అనుకోవడం భ్రమ. ధరణి విషయంలో కేసీఆర్ చాలా ఫోకస్ పెట్టి ప్రతి సభలోనూ వివరిస్తున్నారు. దాని మీద అంత శ్రద్ధ పెట్టడానికి బహుశా రెండు కారణాలు ఉండవచ్చు. 

ఒకటి- ధరణి అనేది తమ ప్రభుత్వానికి తురుపుముక్క అని కేసీఆర్ భావిస్తుండాలి. కేవలం ధరణి పోర్టల్ మాత్రమే తమ ప్రభుత్వాన్ని గట్టెక్కిస్తుందని ఆయన నమ్ముతుండాలి. రెండు- ధరణి గురించి కాంగ్రెస్, బిజెపి చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మితే గనుక.. తమ ప్రభుత్వానికి సమాధి తప్పదని ఆయన భయపడుతుండాలి. అందుకే దాని గురించి ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టి మాట్లాడుతున్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారని, అలా అనేవారినే బంగాళా ఖాతంలో కలిపేయాలని కేసీఆర్ పదే పదే ప్రతిచోటా చెబుతుండడం గమనార్హం.

ఇక పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలుస్తూ.. ఆరాష్ట్రంలో పరిపాలన గురించి నిందలు వేయడానికి కేసీఆర్ ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కాని సంగతి. ఏపీలో పాలన బాగాలేదు, ఏపీ ఎంత అధ్వానంగా ఉందో చూడండి.. దానితో పోలిస్తే తెలంగాణ అద్భుతంగా ఉంది అని ప్రతిసారీ చెబుతున్నారు. రాష్ట్రాన్ని చీల్చినప్పుడే.. ఉమ్మడి రాష్ట్ర సంపద కేంద్రీకృతమైన ప్రాంతం తెలంగాణగా ఏర్పడింది. ఏపీ అనాథగా మిగిలి ఇంకా అవస్థల్లో ఉంది. కేసీఆర్ అక్కడి ఇబ్బందుల గురించి మాట్లాడడం అనేది ఆ రాష్ట్రం యొక్క వనరుల లేమిని ఎద్దేవా చేసినట్టే అక్కడి వారిని బాధ పెడుతోంది.

కేసీఆర్ ఏపీ మీద నిందలు వేయడంలో వ్యూహం అర్థం కావడం లేదు. ఆ రాష్ట్రంలో ఆయన విజయం సాధించబోయేదేమీ లేదు. భారాస కాదు కదా.. ఏపీరాస అనే ఇంకో పార్టీ పెట్టినా కూడా ఆ రాష్ట్రంలో కేసీఆర్ కు ఓట్లు పడవు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకు అక్కడి ప్రజలు జీవితకాలంలో క్షమించరు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో సాధించేదేమీ లేకపోగా, అక్కడి వారి మీద ఎందుకింత నిందలు వేస్తున్నారో, ఎద్దేవా చేస్తున్నారో అర్థం కావడం లేదు.