ఆర్ఆర్ఆర్ సినిమా ప్రచారం పీక్స్ లో సాగుతోంది. ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు రాజమౌళి విరామం లేకుండా దేశం చుట్టేస్తున్నారు. అన్ని భాషల ఆడియన్స్ కు సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో కూడా ఎన్నో వినూత్న పోకడలు అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ రోజు థియేటర్లలో కూడా టీమ్ హంగామా చేస్తుందనే గాసిప్ ఎప్పట్నుంచో నడుస్తోంది. తాజాగా దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజు హీరోలిద్దరూ ఏ థియేటర్ ను సందర్శించరని చెప్పేశాడు రాజమౌళి. ఆడియన్స్ మధ్య కూర్చొని ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనే కోరిక అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరికీ ఉన్నప్పటికీ.. ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదని అంటున్నాడు జక్కన్న. తను అంత రిస్క్ చేయలేనని చెప్పేశాడు.
కెరీర్ లో ఒకే ఒక్క సారి ఆడియన్స్ మధ్య కూర్చొని సినిమా చూశాడు చరణ్. అది కూడా తన తొలి సినిమా చిరుత. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. అతడు ఇప్పటివరకు ప్రేక్షకుల మధ్య కూర్చొని తను నటించిన సినిమా ఒక్కటి కూడా చూడలేదట. మళ్లీ ఇన్నాళ్లకు ఆర్ఆర్ఆర్ తో ఆ కోరిక తీర్చుకోవాలనుకున్నారు హీరోలిద్దరూ. ఇదే విషయాన్ని రాజమౌళికి కూడా చెప్పారు.
నిజానికి రాజమౌళి కూడా ఈ యాంగిల్ లో వర్కవుట్ చేశాడట. తెలుగు రాష్ట్రాల్లో ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి, పొరుగునే ఉన్న కర్నాటక లేదా తమిళనాడులోనైనా ట్రై చేద్దాం అనుకున్నాడట. కానీ ఎలా చూసినా, ప్రాక్టికల్ గా అది సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చేశాడు రాజమౌళి.
అయితే తను మాత్రం ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలో చూస్తానని క్లారిటీ ఇచ్చాడు. మొదటి రోజు మొదటి ఆట చూస్తానని, అది ఎక్కడే విషయాన్ని మాత్రం చెప్పనని అంటున్నాడు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది ఆర్ఆర్ఆర్.