కన్నతండ్రి చంపాడా, బావ హతమార్చాడా?

వికారాబాద్ లో అత్యంత దారుణంగా హత్యకు గురైన శిరీష కేసుకు సంబంధించి 24 గంటలు గడిచేలోపే ఊహించని ట్విస్టులు బయటపడుతున్నాయి. ఈ కేసులో ముందుగా శిరీష బావ అనీల్ ను పోలీసులు అనుమానించారు. అతడ్ని…

వికారాబాద్ లో అత్యంత దారుణంగా హత్యకు గురైన శిరీష కేసుకు సంబంధించి 24 గంటలు గడిచేలోపే ఊహించని ట్విస్టులు బయటపడుతున్నాయి. ఈ కేసులో ముందుగా శిరీష బావ అనీల్ ను పోలీసులు అనుమానించారు. అతడ్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇప్పుడు శిరీష తండ్రిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈరోజు శిరీష తండ్రిని కాడ్లాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. శిరీషను ఎందుకు చంపావంటూ, తండ్రిని నిలదీయడం అనుమానాస్పదంగా మారింది. ఉన్నఫలంగా గ్రామస్తులు ఇలా తండ్రిపై విరుచుకపడ్డారంటే, గతంలో ఏదో జరిగే ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఈ కోణంలో కూడా వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

ఇంట్లో జరిగిన చిన్న గొడవతో మనస్తాపానికి గురైన శిరీష, ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. అలా వెళ్లిన అమ్మాయి తిరిగి రాలేదు. మరుసటి రోజు పొద్దున్నే, గ్రామానికి సమీపంలో ఉన్న నీటికుంటలో ఆమె మృతదేహం బయటపడింది. అత్యంత దారుణంగా ఆమెను హత్య చేశారు.

శిరీష ఒంటిపై చాలా గాయాలు గుర్తించారు పోస్టుమార్టం చేసిన వైద్యులు. ఆమె చేతి నరాలు కట్ చేశారు. స్క్రూ డ్రైవర్ లాంటి వస్తువుతో 2 కళ్లు పొడిచేశారు. ఆ తర్వాత మరో ఆయుధంతో ఆమె గొంతు కోశారు. ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్మీడియట్ చదివిన శిరీష, హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తోంది. ఊరిలో తండ్రి, సోదరుడు మాత్రమే ఉంటారు. వాళ్లకు వంటకు ఇబ్బంది అవుతుందని, శిరీషను కాడ్లాపూర్ తీసుకొచ్చారు. అయితే శిరీష వంట చేసి పెట్టడం లేదంటూ, సోదరుడు, మరో అక్క భర్తకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాడ్లాపూర్ వచ్చిన అక్క భర్త, శిరీషను మందలించాడు. ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిరీష, రాత్రి 10 గంటల టైమ్ లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అక్కడ్నుంచి ఆమె జాడ కనిపించలేదు. పొద్దున్న చూస్తే శవమై తేలింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యుల బృందం కూడా పోస్టుమార్టం తర్వాత ఎలాంటి వివరాల్ని వెల్లడించకపోవడం గ్రామస్తులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ క్రమంలో శిరీష తండ్రిపై గ్రామస్తులు దాడికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు.