డిజిటల్ కావాలి.. మీడియా వద్దు

కాలం మారుతోంది. విజువల్, డిజిటల్ మీడియా శక్తిమంతంగా దూసుకెళ్తోంది. ప్రింట్ మీడియా బలంగా వుండనే వుంది. అందువల్ల రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా జనాలు కావచ్చు. అటు ప్రింట్, ఇటు విజువల్, ఇంకా డిజిటల్…

కాలం మారుతోంది. విజువల్, డిజిటల్ మీడియా శక్తిమంతంగా దూసుకెళ్తోంది. ప్రింట్ మీడియా బలంగా వుండనే వుంది. అందువల్ల రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా జనాలు కావచ్చు. అటు ప్రింట్, ఇటు విజువల్, ఇంకా డిజిటల్ మీడియా ఇలా అన్ని చోట్లా తమకు ప్రచారం కోరుకుంటున్నారు. కానీ డిజిటల్ మీడియాలో పెరిగిపోతున్న పోటీ వాతావరణం, తగ్గుతున్న క్వాలిటీ పుణ్యమా అని సెలబ్రిటీలు ఫిజికల్ గా దానికి దూరంగా వుండాలని చూస్తున్నారు. పరోక్షంగా డిజిటల్ మీడియాలో ప్రచారం కోరుకుంటున్నారు తప్ప, నేరుగా దాని ముందుకు రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.

డిజిటల్ మీడియా అనగానే టీవీ చానెళ్లు, యూ ట్యూబ్ చానెళ్లు, ట్విట్టర్, ఇన్ స్టా వంటి ప్లాట్ ఫారమ్ లు గుర్తుకు వస్తాయి. అవసరం అయితే తప్ప పెద్ద సినిమాల జనాలు టీవీ చానెళ్ల దగ్గరకు వెళ్లడం లేదు. ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలోని గేమ్ షోలకు వెళ్లడానికి ఆసక్తిగా వున్నారు కానీ యాంకర్ల దగ్గర కూర్చుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. అలాగే యూ ట్యూబ్ చానెళ్లు అంటే చాలు పెద్ద హీరోలు ఆమడదూరంలో వుంటున్నారు. ఇక్కడ రెండు సమస్యలు. వేలాది యూ ట్యూబ్ చానెళ్లు వున్నాయి. కనీసం డజను చానెళ్లకు అయినా ఇంటర్వూలు ఇవ్వాలి. మెయిన్ స్ట్రీమ్ టీవీ చానెళ్లతో కలిపితే కనీసం రెండు పదుల ఇంటర్వూలు ఇవ్వాలి. కొంతమందికి ఇచ్చి కొంత మందికి ఇవ్వకపోతే అదో సమస్య. అందుకే మొత్తానికి ఎత్తి కట్టేస్తున్నారు.

క్వశ్చను ఆండ్ ఆన్సర్ సెషన్ పెడితే, సామూహిక ఇంటర్వూ మాదిరిగా వుంటుందనే ఆలోచన చాలా మంది చేస్తున్నారు. చాలా మంది పెద్ద హీరోలు దానికి కూడా దూరంగా వుంటున్నారు. సినిమా హిట్ అయ్యాక ఇంటర్వూలు, సామూహిక పేరంటం లాంటివి చూద్దాం అని ఆలోచిస్తున్నారు. ఫ్లాప్ అయితే ఇక సైలంట్ అయిపోతున్నారు.

సినిమాలకు డిజిటల్ మీడియా ప్రమోషన్ గుత్తకు తీసుకునే వారి ఆలోచనలు ఇంకోలా వున్నాయి. ఇంటర్వూలు ప్లాన్ చేయడం, వాటిలో సరైన ప్రశ్నలు రాకపోయినా, రాంగ్ క్వశ్చన్లు వచ్చినా తమకే అక్షింతలు. లేదూ ఇంటర్వూలు దక్కని చానెళ్లు నెగిటివ్ సైడ్ తీసుకున్నా తమకే బాధ. అందుకే ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఎత్తి కట్టేస్తున్నారు.

దానికి బదుల ట్విట్టర్ లేదా ఇన్ స్టా లో ఓ గంట ప్రశ్నోత్తరి కార్యక్రమం నిర్వహిస్తే సరిపోతుందనుకుంటున్నారు. మన దగ్గర నెగిటివ్ క్వశ్చన్లు, పర్సనల్ క్వశ్చన్లు అడిగితే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అదే నార్త్ మీడియా దగ్గరకు వెళ్లాక వాళ్లు ఏమి అడిగినా నవ్వుతూ సమాధానం ఇస్తున్నారు. సమంత, చైతన్య ఇంటర్వూలు ఇలాంటివే. ఇక్కడ మీడియాను అది అడగొద్దు.. ఇది అడగొద్దు అంటూ కట్టడి చేస్తారు. అక్కడికి వెళ్లాక వాళ్లు అడుగుతారు. వీళ్లు సమాధానం చెబుతారు.

ప్రతి హీరోకీ ఓ సమస్య. రాజకీయాలు కొందరికి అడగకూడదు. లవ్, ఫ్యామిలీ క్వశ్చన్లు కొందరిని అడగకూడదు. ఫ్లాపుల గురించి కొందరి దగ్గర ప్రస్తావించకూడదు. హీరోలు వరుసగా నాలుగు నుంచి ఏడు ఎనిమిది ఫ్లాపులు ఇస్తూ, బయ్యర్లు కుదేలయిపోయి, అప్పుల పాలైపోయినా హీరోల దగ్గర ప్రస్తావించకూడదు.  చాలా సినిమాలు చివరకు వచ్చేసరికి హీరో-దర్శకుడు లేదా హీరో-నిర్మాత ఎడమొహం పెడమొహం గా వుంటారు. ఇలాంటిివి అస్సలు చూసీ చూడనట్లు వదిలేయాలి.

ఇలా చాలా కారణాల వల్ల డిజిటల్ మీడియాకు హీరోలు దూరంగా వుంటున్నారు. అదే ప్రింట్ మీడియా అయితే కాస్త సౌలభ్యం వుంది. పెద్దగా కాంట్రావర్సీలు చేయరు. విడియో రికార్డింగ్ వుండదు కాబట్టి, తేడా వస్తే అలా అనలేదు అనేసే సౌలభ్యం చాలా వరకు వుంటుంది.

దీనికి తోడు చిన్న చితక యూ ట్యూబ్ చానెళ్ల వైఖరి కూడా అలాగే వుంది. తొంభై శాతం థంబ్ నెయిల్స్ పరమ దారుణాతి దారుణం. తొంభై శాతం యూ ట్యూబ్ చానెళ్ల థంబ్ నెయిల్ పాయింట్ ఆ వీడియోల్లో ఎంత వెదికినా కనిపించదు. క్లిక్ చేస్తారని పెట్టేయడమే. ఎందుకంటే జవాబుదారీ తనం లేదు కదా.

డిజిటల్ మీడియా పబ్లిసిటీ గుత్తకు తీసుకున్నవారు కూడా చిత్రమైన పోకడలు పోతున్నారు. లెక్కకు మించిన మీడియా సంస్థలు పుట్టుకురావడంతో, ఎవరితోనూ శతృత్వం లేకుండా ప్రకటనలు కూడా ఎత్తి కట్టేస్తున్నారు. గూగుల్ యాడ్స్ బెటర్ అనే ఫీడ్ బ్యాక్ ను నిర్మాతలకు ఇస్తున్నారు. దానివల్ల సింగిల్ విండోతో సమస్య పరిష్కారం అయిపోతుంది.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఇటు వైపు సమస్యలు.. అటు వైపు భయాలు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు డిజిటల్ పబ్లిసిటీ కోరుకుంటున్నారు. కానీ త్రూ మీడియా అంటే మాత్రం మొహం చాటేస్తున్నారు. అంతకన్నా ఈజీ వే, నాన్ కాంట్రావర్షియల్ వే వెదుకుతున్నారు. ఆ దిశగానే పయనిస్తున్నారు.