ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మరోసారి తన ఘనత చాటుకుంది. నిజానికి గతేడాది ఇది నంబర్ వన్ స్థానాన్ని పోగొట్టుకుంది. అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ ఉండేది. ఇప్పుడు ఆ సిటీని వెనక్కు నెట్టి, 2023 సంవత్సరానికి గాను న్యూయార్క్ సిటీ నివశించడానికి కాస్ట్ లీ సిటీ గా అవతరించింది. హాంకాంగ్ రెండో స్థానంలో ఉంది
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వసతి ఖర్చులు, రవాణా ఛార్జీలు, నిత్యావసరాలు, ఇళ్ల అద్దెలు లాంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, ఈసీఏ ఇంటర్నేషనల్ సంస్థ వరల్డ్ కాస్ట్ లీయస్ట్ నగరాల జాబితాలను సిద్ధం చేసింది. ఈ లిస్ట్ లో న్యూయార్క్, హాంకాంగ్ మొదటి రెండు స్థానాల్లో నిలవగా.. జెనీవా, లండన్ 3, 4 స్థానాల్లో నిలిచాయి.
ఈసారి లిస్ట్ లో ఆశ్చర్యకరమైన ఫలితం ఏదైనా ఉందంటే అది సింగపూర్ నగరమే. గతేడాది ఖరీదైన నగరాల్లో 13వ స్థానంలో ఉన్న సింగపూర్, ఈ ఏడాది ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. సింగపూర్ లో ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు, కరోన తర్వాత అక్కడ ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరగడం దీనికి కారణాలు.
120 దేశాల్లోని 207 నగరాల జీవన ప్రమాణాల్ని విశ్లేషించి ఈ నివేదిక తయారుచేశారు. సింగపూర్ తరహాలోనే దుబాయ్ కూడా అమాంతం ఖరీదైన నగరంగా మారింది. గతేడాది 23వ స్థానంలో ఉన్న ఈ సిటీ, ఇప్పుడు 12వ స్థానానికి ఎగబాకింది. రష్యా నుంచి ఎక్కువ మంది దుబాయ్ కు వలసరావడంతో ఈ పరిణామం సంభవించినట్టు నివేదిక తెలిపింది.
కరెన్సీ మారక విలువ తగ్గడం వల్ల యూరోపిన్ దేశాలతో పాటు, చైనాలోని కొన్ని నగరాలు టాప్-10 లిస్ట్ లోంచి బయటకు వచ్చేశాయి. టాప్-20 లిస్ట్ లో ఇండియాలోని ఏ నగరానికి చోటు దక్కలేదు. 2023లో నివశించడానికి అత్యంత ఖరీదైన టాప్-10 నగరాల లిస్ట్ ఇలా ఉంది.. 1. న్యూయార్క్, 2. హాంకాంగ్, 3. జెనీవా, 4. లండన్, 5. సింగపూర్, 6. జ్యూరిచ్, 7. శాన్ ఫ్రాన్సిస్కో, 8. టెల్ అవీల్, 9. సియోల్, 10. టోక్యో.