ఆదిపురుష్ ఫంక్షన్-ఖర్చు నాలుగు కోట్లు

ఈ నెంబర్ కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ నిజం. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఖర్చు అక్షరాలా దగ్గర దగ్గర నాలుగు కోట్లు. ఫంక్షన్ అధ్భుతంగా జరిగింది. అందులో సందేహం లేదు.…

ఈ నెంబర్ కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ నిజం. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఖర్చు అక్షరాలా దగ్గర దగ్గర నాలుగు కోట్లు. ఫంక్షన్ అధ్భుతంగా జరిగింది. అందులో సందేహం లేదు. ఇంటిలిజెన్స్ విభాగం చెబుతున్న లెక్కల ప్రకారం లక్షకు పైగానే జనం ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. 

యువి సంస్థ, పీపుల్స్ మీడియా, శ్రేయాస్ మీడియా ఈ మూడు సంస్థలకు చెందిన సిబ్బంది వారం రోజులు శ్రమిస్తే ఈ సభ ఈ విధంగా జరిగింది. ఈ మూడు సంస్థలకు చెందిన వందకు పైగా సిబ్బంది శ్రమ సంగతి పక్కన పెడితే, అయిన ఖర్చు నాలుగు కోట్లు.

ఈవెంట్ ను అద్భుతంగా నిర్వహించిన శ్రేయాస్ మీడియా కేవలం సభ ఏర్పాట్లకు చేసిన బిల్లు నే రెండున్నర కోట్లు అని తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సభలకు స్పాన్సర్లు తెస్తారు. వాళ్లు చాలా వరకు భరిస్తారు. మిగిలినది నిర్మాత భరిస్తారు. కానీ ఈ ఫంక్షన్ కు స్పాన్సర్లు ఎవరినీ తేవద్దని ముందుగానే క్లియర్ గా చెప్పేసారు. ఎంత ఖర్చయినా తామే భరిస్తామని యువి సంస్థ స్పష్టం చేసింది.

దాంతో గ్రౌండ్ వర్క్, వాటర్ ప్రూఫ్ లైటింగ్, వాటర్ ప్రూఫ్ అడియో ఎక్విప్ మెంట్, సోఫాలు, కుర్చీలు ఇలా ఒకటేమిటి సమస్త ఏర్పాట్లకు రెండున్నర కోట్లు బిల్ చేసారు. ఇది కాక ముంబాయి నుంచి డ్యాన్సర్లను, సింగర్లను, వాయిద్య బృందాన్ని అందరినీ ఫ్లయిట్లలో రప్పించారు. వాళ్లకు హోటళ్లలో అకామిడేషన్ ఇచ్చారు. ఫీజులు చెల్లించారు. లక్షల ఖర్చుతో బాణాసంచా తెప్పించారు.

పీపుల్స్ మీడియా, యువి, శ్రేయాస్ మీడియా సంస్థలకు చెందిన సిబ్బంది వంద మందికి పైగా వారం రోజుల పాటు తిరుపతిలోనే మకాం వేసారు. హోటళ్లలోనే వున్నారు. వివిధ భాషలకు చెందిన మీడియాను, హైదరాబాద్ మీడియాను పెద్ద సంఖ్యలో తిరుపతికి ఫ్లయిట్లలో రప్పించారు. వారికి అకామిడేషన్ ఇచ్చారు. ఇలాంటి వన్నీ కలిపి యువి సంస్థకు కోటిన్నర వరకు ఖర్చయిందని తెలుస్తోంది.

అటు శ్రేయాస్ మీడియా చేసిన బిల్, ఇటు ఈ ఖర్చు కలిపి మొత్తం మీద ఈ ఫంక్షన్ ఖర్చు నాలుగు కోట్లు. అయితేనేం. నభూతో..అన్నట్లు రంగరంగ వైభవంగా జరిగింది. సినిమాకు మాంచి బజ్ వచ్చింది.