90ల‌లో పుట్టిన వారికి పెద్ద సమ‌స్య.. పెళ్లి!

భార‌త‌దేశంలో, ప్ర‌త్యేకించి ద‌క్షిణ భార‌త‌దేశంలో 90ల‌లో పుట్టిన యువ‌త‌కు ఇప్పుడు కాస్త ఇబ్బంది పెడుతున్న అంశాల్లో ఒక‌టి పెళ్లి. వివాహం కాక కొంద‌రు, వివాహం చేసుకోవాలా.. వ‌ద్దా.. అనే త‌ట‌ప‌టాయింపులో మ‌రి కొంద‌రు, కోరిన‌ట్టుగా…

భార‌త‌దేశంలో, ప్ర‌త్యేకించి ద‌క్షిణ భార‌త‌దేశంలో 90ల‌లో పుట్టిన యువ‌త‌కు ఇప్పుడు కాస్త ఇబ్బంది పెడుతున్న అంశాల్లో ఒక‌టి పెళ్లి. వివాహం కాక కొంద‌రు, వివాహం చేసుకోవాలా.. వ‌ద్దా.. అనే త‌ట‌ప‌టాయింపులో మ‌రి కొంద‌రు, కోరిన‌ట్టుగా వైవాహిక బంధం ఏర్ప‌డ‌క మ‌రి కొంద‌రు.. ఈ విష‌యంలో బాగా ఇబ్బందులు ప‌డుతున్నారు!

ప‌ల్లెటూళ్ల‌లోకి వెళ్లి చూస్తే ప్ర‌తి ఊర్లోనూ ప‌దుల సంఖ్య‌లో అబ్బాయిల‌కు పెళ్లిళ్లు కావ‌డం లేద‌నే విష‌యం అర్థం అవుతుంది. వెయ్యి జ‌నాభా ఉన్న ఊళ్లో క‌నీసం ముప్పై నుంచి న‌ల‌భై మంది యువ‌కుల‌కు పెళ్లి కావ‌డం లేదు స‌గ‌టున‌! ఏపీలోని ఏ ఊళ్లోకి వెళ్లి చూసినా.. ముదురు బ్ర‌హ్మ‌చారులు బోలెడంత‌మంది క‌నిపిస్తున్నారు. ప్ర‌తి వెయ్యి జ‌నాభాలోనూ క‌నీసం ఇర‌వై మంది అబ్బాయిలు పెళ్లి కోసం ఎదురుచూపుల్లో ఉంటున్నారు.

1980ల చివ‌ర్లో పుట్టి.. ఇప్పుడు 40కు చేరువ అవుతున్న అబ్బాయిలు చాలా మంది ఇంకా పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఎంతో కొంత అర్హ‌త ఉన్నా.. మంచి ఉద్యోగం లేద‌నో, ఫ్యామిలీకి పెద్ద‌గా ఆస్తులు లేవ‌నో వీరు తిర‌స్క‌ర‌ణ‌కు గురి అవుతున్నారు. అమ్మాయిలు, అమ్మాయిల త‌ల్లిదండ్రుల ప్రాధాన్య‌త‌ల‌కు వీరు చాల‌డం లేదు!

ఇది ఎంత విచిత్ర‌మైన స‌మ‌స్య అంటే గ్రామీణ ప్రాంతాల‌కు వెళ్లి ప‌రిశీలిస్తే అర్థం అవుతుంది. త‌మ కూతురుకు అన్ని హంగూ అర్హ‌త‌లూ, ఆర్భాటాలు ఉండే యువ‌కుడిని చూసి పెళ్లి చేస్తున్నారు అమ్మాయిల త‌ల్లిదండ్రులు. వారికే ఒక అబ్బాయి ఉంటే.. అత‌డికి పెళ్లి చేయ‌డానికి మాత్రం ముప్పు తిప్ప‌లు ప‌డుతున్నారు.

జాబ్ ఉండాలి, వెనుక ఆస్తులు ఉండాలి, త‌ల్లిదండ్రులు, తోబుట్టువులు ఆ అబ్బాయి మీద ఆధార‌ప‌డే ప‌రిస్థితి ఉండ‌కూడ‌దు! మంచి ఉద్యోగం ఉన్నా..  ఆస్తులు లేవంటే అప్పుడే ప్రాధాన్య‌త త‌గ్గిపోతుంది. ఆస్తులు బ్ర‌హ్మాండంగా ఉన్నాయి కానీ ఉద్యోగం చేయ‌డం లేదన్నా.. ఉప‌యోగం లేదు! ఇక ఎంతో కొంత అందం కూడా త‌ప్ప‌నిస‌రి!

ఆస్తులు ఎంతో కొంత ఉండి, సిటీలో ఏ సాఫ్ట్ వేర్ ఉద్యోగ‌మో చేస్తున్న పాతికేళ్ల కుర్రాళ్ల‌కూ ఈజీగా పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఏదో నామ‌మాత్రంగా డిగ్రీలు చేసి, ఉద్యోగాలు సంపాదించుకోలేక ఊళ్ల‌లోనే ఉన్న వారిలో 40 యేళ్లు దాటినా..బ్ర‌హ్మ‌చ‌ర్య‌మే గ‌తి.

మ‌రి సామాజికంగా ఇది ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారి తీస్తుంది? అనేది ఇప్పుడ‌ప్పుడే స‌మాధానం దొరికే ప్ర‌శ్న కాదు. గ‌త త‌రంలో పెళ్లి కాకుండా మిగిలిపోయిన అబ్బాయిల సంఖ్య పెద్ద‌గా లేదు. ఏ ఊరికి వెళ్లి చూసినా.. 2010కి ముందే 30, 32 యేళ్ల వ‌య‌సుకు కు వ‌చ్చిన వారికి దాదాపు పెళ్లిళ్లు అయిపోయాయి. అయితే ఆ త‌ర్వాతి వారిదే ఇబ్బంది క‌ర‌మైన ప‌రిస్థితి.

వీరిలో చాలా మంది ఇక పెళ్లి అవుతుంద‌నే ఆశాభావాన్ని కూడా వ‌దిలేసుకుంటున్నారు. పెళ్లిపై ఎంత మోజు ఉన్నా.. సోలో లైఫే త‌ప్ప‌ద‌నే ప‌రిస్థితి వారి మాట‌ల్లో ధ్వ‌నిస్తోంది.

మ‌రి ఇప్పుడు ప్ర‌తి వెయ్యి జ‌నాభా ఉన్న ఊరికీ ఇర‌వై ముప్పై మంది బ్ర‌హ్మ‌చారులుగా మిగిలిపోతే.. ఈ సామాజిక స్థితి ఇంకో ఇర‌వై యేళ్ల త‌ర్వాత వేరే సామాజిక ప‌రిస్థితుల‌కు కార‌ణం కావొచ్చు. పెళ్లి పై ఆస‌క్తి కూడా ఉండి చేసుకోలేక‌పోతున్న త‌రం వ‌ల్ల జనాభా నియంత్ర‌ణ కొంత వ‌ర‌కూ క‌లుగుతుందేమో! 

అలాగే ఇలా వ‌య‌సుకు వ‌చ్చినా పెళ్లి కాక‌పోవ‌డం వ‌ల్ల‌..లైంగిక అంశాల‌ను స‌మాజం చూసే దృష్టిలో కూడా పెను మార్పు రావ‌డం ఖాయం. భారీ సంఖ్య‌ల్లోని ఈ బ్యాచిల‌ర్స్ ను స‌మాజం ముందు ముందు ఎలా ట్రీట్ చేస్తుంద‌నేది కీల‌క‌మైన అంశం.