ఇది బిజెపితో తెగతెంపులు చేసుకోవడమే!

పవన్ కల్యాణ్ చాలా పరిణతి గల రాజకీయ నాయకుడిలాగా, కొన్ని అంశాలు మాత్రం వ్యూహాత్మకంగా మాట్లాడారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ ను గద్దె దించడానికి బిజెపినే తనకు రోడ్ మ్యాప్ ఇవ్వవలసి ఉన్నదని, ఇస్తామని అన్నారని’’…

పవన్ కల్యాణ్ చాలా పరిణతి గల రాజకీయ నాయకుడిలాగా, కొన్ని అంశాలు మాత్రం వ్యూహాత్మకంగా మాట్లాడారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ ను గద్దె దించడానికి బిజెపినే తనకు రోడ్ మ్యాప్ ఇవ్వవలసి ఉన్నదని, ఇస్తామని అన్నారని’’ అనడం కేవలం ఒక వ్యూహాత్మక మాటగా కనిపిస్తోంది. 

తద్వారా భాజపా స్పందించి తీరవలసిన ఒక అనివార్య పరిస్థితిని ఆయన కల్పించారు. దీనివలన, వారు ఎలాంటి మార్గదర్శనం చేస్తారనేది తరువాత.. ముందుముందు నెపం వారిమీదకు నెట్టేసి, నింద వారిమీద వేసేసి.. తెగతెంపులు చేసుకోవడం చాలా సులువు అయిపోతుంది. ఎలాగంటే..

రాష్ట్రంలో బీజేపీ రెండు రకాల భిన్న వైఖరులను అనుసరిస్తోంది. ఒకటి- వైఎస్సార్ కాంగ్రెస్ పట్ల మెతక వైఖరి. రెండు- తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్రమైన ద్వేషంతో కూడిన వ్యతిరేకత. 
2014, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రదర్శించిన అవకాశవాద రాజకీయాలను వారు ఎన్నటికీ మర్చిపోరు. 

అటు 2014లో బీజేపీతో పొత్తుతో దేశవ్యాప్తంగా ఉన్న మోడీ హవాను తనకు అనుకూలంగా వాడుకుని, 2019 నాటికి అదే మోడీని నానా మాటలు తిట్టిన బాబు మీద వారికి పీకల్దాకా కోపం ఉంది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా.. ఏపీలో ఏనాటికైనా బలమైన పార్టీగా ఎదగాలనే ఉద్దేశంతో ఇక జీవితంలో బాబుతో చేతులు కలపకూడదనే వారు డిసైడైపోయారు. 

ఇప్పుడు పవన్ వచ్చి వ్యతిరేక ఓటున చీలకూడదు’ అంటే అందరూ కలిసి పోటీచేయాలనే పాట ఎత్తుకున్నారు. ఇది అనూహ్యం కాకపోయినా.. బిజెపిని సంప్రదించకుండానే వారి తరఫున కూడా కమిట్మెంట్ ఇచ్చేశాడు. వైసీపీని కూలుస్తారనే నమ్మకంతోనే, ఆ భరోసా ఇచ్చినందునే తాను అసలు వారితో పొత్తు పెట్టుకున్నానని కూడా రేపో మాపో పవన్ మళ్లీ ప్రకటిస్తారు. అలా వారు స్పందించి తీరవలసిన ఒత్తిడి పెంచుతారు. 

కానీ పవన్ మైండ్ గేమ్ కు కేంద్ర బీజేపీ పడిపోతుందా? ఖాతరు చేయకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుందా అనేది ముఖ్యం. వారు స్పందించకపోతే గనుక.. ‘వైసీపీని కూల్చడానికి’ తనకు ఇచ్చిన మాట మీద నిలబడలేదు గనుక.. వారినుంచి దూరం జరుగుతున్నానని ప్రకటించేసి పవన్ బయటకు వచ్చేయడం సులువు అయిపోతుంది. 

తెలుగుదేశంతో జత కట్టడానికి ఆయన రూటు మ్యాప్ తనే తయారు చేసుకుంటారు. కమలదళంతో తెగతెంపులకు డిసైడయ్యాకే పవన్ ఇలా వ్యూహాత్మకంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది.