స‌స్పెన్ష‌న్‌పై కోర్టు కీల‌క ఆదేశాలు

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. స్పీక‌ర్ నిర్ణ‌యంపై తాము జోక్యం చేసుకోలేమంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ…

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. స్పీక‌ర్ నిర్ణ‌యంపై తాము జోక్యం చేసుకోలేమంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎమ్మెల్యేలు డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించారు. 

సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన డివిజ‌న్ బెంచ్ తామిచ్చిన నోటీసుల‌ను అసెంబ్లీ కార్య‌ద‌ర్శి తీసుకోక‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అనంత‌రం నేరుగా నోటీసులు ఇవ్వాల‌ని రిజిస్ట్రార్‌కు ధ‌ర్మాసనం ఆదేశాలు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో మొద‌టి రోజే ప్ర‌తిప‌క్ష స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌కు దారి తీసింది. బ‌డ్జెట్ స‌మావేశాల మొద‌టి రోజు స‌భ‌కే అంత‌రాయం క‌లిగిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈట‌ల రాజేంద‌ర్‌, రాజాసింగ్‌, ర‌ఘునంద‌న్‌రావుల‌ను స్పీక‌ర్ స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మపై వేటు వేయ‌డం ద్వారా తెలంగాణ అసెంబ్లీ స‌భ్యుల హ‌క్కుల్ని హ‌రించివేయ‌డ‌మే అని, న్యాయం చేయాల‌ని బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

విచారించిన సింగిల్ బెంచ్ స్పీక‌ర్ నిర్ణ‌యంలో కోర్టు జోక్యం చేసుకోబోదంటూ తీర్పు చెప్పింది. ఈ ఆర్డ‌ర్‌ను స‌వాల్ చేస్తూ మ‌రోసారి హైకోర్టును బీజేపీ ఎమ్మెల్యేలు ఆశ్ర‌యించారు. వీరి పిటిష‌న్‌పై ఇవాళ హైకోర్టు డివిజ‌న్ బెంచ్ విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ కార్యదర్శికి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ రోజు సాయంత్రం 4గంటల లోపు ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌పై హైకోర్టు జోక్యం చేసుకున్న నేప‌థ్యంలో, నిర్ణ‌యం ఎలా వుంటుందోన‌నే సీరియ‌స్ చర్చ జ‌రుగుతోంది.