తల్లి కోసం 14 ఏళ్ల తర్వాత వచ్చాడు.. అంతలోనే!

కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. తీరని కడుపుకోత మిగిల్చింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంతకుమించిన విషాదం. తల్లి కోసం 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతింటికి…

కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. తీరని కడుపుకోత మిగిల్చింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంతకుమించిన విషాదం. తల్లి కోసం 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతింటికి వచ్చిన కొడుకును పొట్టనపెట్టుకుంది ఈ ఘోర రైలు ప్రమాదం. 14 ఏళ్ల తర్వాత వచ్చిన కొడుకు రోజు గడవకుండానే చనిపోవడం, మరోవైపు తల్లిని కూడా కోల్పోవడం ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కర్ని కలచివేస్తోంది.

బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేష్-సురేష్ అన్నదమ్ములు. అన్నయ్య రమేష్ బతుకుతెరువు కోసం బాలేశ్వర్ నుంచి చెన్నై వెళ్లిపోయారు. ఆ వెళ్లిపోవడం మళ్లీ తిరిగిరాలేదు. చెన్నైలోనే స్థిరపడిపోయాడు. అయితే కొన్ని రోజుల కిందట రమేష్ తల్లి బాలేశ్వర్ లో మరణించింది. ఆమె కర్మకాండల కోసం 14 ఏళ్ల తర్వాత సురేష్, మళ్లీ బాలేశ్వర్ లో అడుగుపెట్టాడు.

అంత్యక్రియలు పూర్తిచేసి, తిరిగి చెన్నై బయల్దేరాడు. అన్నయ్యను దిగబట్టేందుకు తమ్ముడు సురేష్ స్టేషన్ వరకు వచ్చాడు. కోరమండల్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి, తమ్ముడ్ని పంపించేశాడు రమేశ్. ఇంటికొచ్చిన సురేష్, కొద్దిసేపటికి అన్నయ్యకు కాల్ చేశాడు. కానీ అతడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

ఇంకాసేపు ఆగి మరోసారి ఫోన్ చేశాడు. ఈసారి ఎవరో ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు. రమేష్ చనిపోయాడని చెప్పారు. దీంతో సురేష్ దుఃఖానికి అంతులేదు. తల్లి లేని బాధలో ఉన్న సురేష్, కొద్ది రోజుల వ్యవథిలోనే అన్నను కూడా కోల్పోయాడు.

అన్న మృతదేహం కోసం ఘటనా స్థలానికి వెళ్లాడు సురేష్. కానీ అక్కడ కనిపించలేదు. ఏ హాస్పిటల్ కు మృతదేహాన్ని తరలించారో తెలియదు. చివరి బాలేశ్వర్ లోని జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలో రమేష్ మృతదేహాన్ని చూసి చలించిపోయాడు సురేష్. అలా తల్లి కోసం 14 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన రమేశ్ కూడా మరణించాడు.