పార్టీపై ప‌ట్టుకోల్పోయిన బాబు!

టీడీపీపై ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌ట్టు కోల్పోయారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌లు టీడీపీలో బ‌య‌ట‌ప‌డుతున్న అస‌మ్మ‌తి స్వ‌రాలు.  Advertisement ఒక‌ప్పుడు టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు.…

టీడీపీపై ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌ట్టు కోల్పోయారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌లు టీడీపీలో బ‌య‌ట‌ప‌డుతున్న అస‌మ్మ‌తి స్వ‌రాలు. 

ఒక‌ప్పుడు టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. మ‌రిప్పుడు… గ‌తానికి భిన్న‌మైన ప‌రిస్థితి. అయినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేని నిస్స‌హాయ స్థితిలో చంద్ర‌బాబును చూస్తున్నాం. మ‌రోవైపు టీడీపీ బ‌ల‌హీనత‌ను పార్టీలోని అస‌మ్మ‌తి స్వ‌రాలు ప్ర‌తిబింబిస్తున్నాయ‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని గ‌త కొంత కాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. త‌న‌కు వ్య‌తిరేకంగా సొంత త‌మ్ముడు కేశినేని చిన్నిని ఎగ‌దోల‌డంపై ఆయ‌న బాహాటంగానే మండిప‌డుతున్నారు. ఇటీవ‌ల పొట్ట‌ల‌దొర‌కు టికెట్ ఇస్తారేమో అంటూ వ్యంగ్యంగా అన్నారు. తాజాగా చిల‌క‌లూరిపేట టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు పార్టీ వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తోపుడు బండ్లు పంపిణీ చేసే వాళ్ల‌కు టికెట్ ఇస్తారా? అంటూ భాష్యం ప్ర‌వీణ్‌ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానాన్ని ప్ర‌శ్నించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధం లేని భాష్యం ప్ర‌వీణ్‌ను ప్రోత్స‌హించ‌డంపై ఆయ‌న మీడియా ముఖంగానే టీడీపీ పెద్ద‌లపై ఆగ్ర‌హించారు. వీటితో పాటు నంద్యాల జిల్లాలో భూమా అఖిల‌ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య గొడ‌వ బ‌జారుకెక్కింది. ఏవీ సుబ్బారెడ్డిపై లోకేశ్ పాద‌యాత్ర‌లోనే అఖిల‌ప్రియ దాడి చేయించారు. ఈ కేసులో ఆమె వారం రోజుల పాటు జైల్లో ఉన్నారు. త‌న చున్నీని లాగాడంటూ ఏవీపై అఖిల‌ప్రియ ఆరోప‌ణ‌లు చేశారు. అలాగే నంద్యాల‌, ఆత్మ‌కూరుల‌లో కూడా తాను ప్ర‌చారం చేస్తాన‌ని ఆమె బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లోని టీడీపీ ఇన్‌చార్జ్‌లు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా నంద్యాల‌లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి వ్య‌తిరేకంగా వ‌ర్గాన్ని అఖిల‌ప్రియ కూడ‌గ‌డుతున్నారు. అయినా టీడీపీ అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర పోషించ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి.

ఇక స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియ‌మించ‌డంపై కోడెల శివ‌రామ్ ఫైర్ అయ్యారు. నాలుగేళ్లుగా చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ కోసం తాను, త‌న త‌ల్లి ప్రాథేయ‌ప‌డుతున్నా ఇవ్వ‌లేద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అలాగే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కోడెల శివ‌రామ్‌తో చ‌ర్చించ‌డానికి వెళ్లిన టీడీపీ నేత‌ల‌ను శ్రేణులు అడ్డుకోవ‌డం గ‌మ‌నార్హం. 

ఇలాంటి చ‌ర్య‌ల‌న్నీ పార్టీకి న‌ష్ట‌దాయ‌క‌మే. చంద్ర‌బాబునాయుడు పార్టీపై ప‌ట్టు కోల్పోయార‌నేందుకు ఇవ‌న్నీ నిద‌ర్శ‌నాలు. మ‌రి సొంత పార్టీలోని విభేదాల‌ను చ‌క్క‌దిద్దితే త‌ప్ప‌, రానున్న ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.