జ‌గ‌న్‌పై కేసులు స‌రే…మ‌రి మీరెందుకు లాలూచీ ప‌డ్డారు?

చంద్ర‌బాబునాయుడు త‌న అస‌మ‌ర్థ‌త‌ను ఇత‌రుల‌పై నెట్ట‌డంలో దిట్ట‌. తాను అధికారంలో వున్న‌ప్పుడు ఏమీ చేయ‌లేద‌ని తానే ప‌రోక్షంగా ఒప్పుకోవ‌డం విశేషం. త‌న‌పై కేసుల కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వంతో సీఎం వైఎస్ జ‌గ‌న్ లాలూచీ ప‌డ్డార‌ని…

చంద్ర‌బాబునాయుడు త‌న అస‌మ‌ర్థ‌త‌ను ఇత‌రుల‌పై నెట్ట‌డంలో దిట్ట‌. తాను అధికారంలో వున్న‌ప్పుడు ఏమీ చేయ‌లేద‌ని తానే ప‌రోక్షంగా ఒప్పుకోవ‌డం విశేషం. త‌న‌పై కేసుల కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వంతో సీఎం వైఎస్ జ‌గ‌న్ లాలూచీ ప‌డ్డార‌ని ఆయ‌న తాజా విమ‌ర్శ‌. 

ఓకే గుడ్‌. మ‌రి తమ‌రెందుకు ప్ర‌శ్నించ‌డం లేదంటే… ఆయ‌న స‌మాధానం ఏంటి? చంద్ర‌బాబుపై ఎలాంటి కేసులు లేవు క‌దా! కేంద్ర ప్ర‌భుత్వానికి ఎందుకు భ‌య‌ప‌డుతున్నారు? గ‌తంలో మోదీని గ‌ద్దె దించుతానంటూ దేశ‌మంతా ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబునాయుడు, తీరా మ‌ళ్లీ కేంద్రంలో బీజేపీ రాగానే ఎందుక‌ని తోక ముడిచారు? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

మోదీ స‌ర్కార్ అంటే చంద్ర‌బాబుకు ఎందుకు భ‌య‌మో బ‌య‌ట పెట్టాల‌నే డిమాండ్స్ తెర‌పైకి వ‌చ్చాయి. చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్‌పై చేసిన విమ‌ర్శ‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అప్ప‌టి ప్ర‌ధాని ఇచ్చిన హామీల‌న్నీ, చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల్ని నెర‌వేర్చాల్సిందిగా కేంద్రంపై సీఎం వైఎస్ జ‌గ‌న్ ఒత్తిడి తేలేద‌ని విమ‌ర్శించారు. 

కేవ‌లం త‌న‌పై  ఉన్న కేసుల మాఫీ చేస్తే చాలు, సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు పంప‌కుండా వుంటే చాల‌నుకుంటూ, కేంద్ర ప్ర‌భుత్వంతో లాలూచీ ప‌డుతున్నార‌ని జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా లేదు, విశాఖ‌కు రైల్వే జోన్ లేదు, విజ‌య‌వాడ‌, విశాఖ‌ల‌కు మెట్రో రైళ్లు లేవ‌ని, అలాగే క‌డ‌ప ఉక్కు లేదంటూ పెద్ద జాబితానే చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

2014లో ఏర్ప‌డిన కొత్త రాష్ట్రానికి అనుభ‌వ‌శాలి అయిన చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రి అయితే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు కోరుకుని, ఆయ‌న‌కు ప‌ట్టం క‌ట్టారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేసిన‌ట్టు? ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చ‌డంలో తాను ఫెయిల్ అయ్యాన‌ని చంద్ర‌బాబు ఒప్పుకుంటున్నారా? ఇటు ఏపీ, అటు కేంద్రంలో బీజేపీతో క‌లిసి అధికారాన్ని పంచుకున్న చంద్ర‌బాబు… రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఎందుకు సాధించ‌లేక‌పోయారో చెప్పే ద‌మ్ము, ధైర్యం ఉందా? త‌న హ‌యాంలో అన్నీ సాధించి వుంటే ఇవాళ జ‌గ‌న్‌ను విమ‌ర్శించే ప‌రిస్థితి వ‌చ్చేదా?

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఏమొస్తుంద‌ని అసెంబ్లీ వేదిక‌గా నాటి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించిన మాట నిజం కాదా? ప్ర‌త్యేక ప్యాకేజీ కోసం హోదాను కేంద్రానికి తాక‌ట్టు పెట్టిన ఘ‌న‌త చంద్రబాబుది కాదా? ఇలా రాష్ట్రానికి జ‌రిగిన ప్ర‌తి అన్యాయంలోనూ త‌న‌దే మెజార్టీ భాగ‌స్వామ్యం అని చంద్ర‌బాబు గుర్తిస్తే మంచిది. 

రాష్ట్ర విభ‌జ‌న నాటి లోటు బ‌డ్జెట్‌ను ఇటీవ‌ల కేంద్రం నుంచి సీఎం వైఎస్ జ‌గ‌న్ రాబ‌ట్టారు. అలాగే పోల‌వ‌రం ప్రాజెక్టుకు కూడా త్వ‌ర‌లో భారీ నిధులు మంజూరు కానున్నాయి. త‌న హ‌యాంలో కానిది, కేంద్రం నుంచి జ‌గ‌న్ సాధిస్తుండడంతో ఓర్వ‌లేక చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే టాక్ న‌డుస్తోంది.