తన బలాన్ని పక్కనపెట్టిన అడ్డాల?

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమాలు కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు. ఇవన్నీ సాఫ్ట్ మూవీసే. ఇదే శ్రీకాంత్ అడ్డాల బలం కూడా. ఇతడు తీసే సినిమాల్లో సన్నివేశాలన్నీ సున్నితంగా, హృదయానికి హత్తుకునేలా…

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమాలు కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు. ఇవన్నీ సాఫ్ట్ మూవీసే. ఇదే శ్రీకాంత్ అడ్డాల బలం కూడా. ఇతడు తీసే సినిమాల్లో సన్నివేశాలన్నీ సున్నితంగా, హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. లాంగ్ గ్యాప్ తర్వాత మరో మూవీతో అడ్డాల ప్రేక్షకుల ముందుకొస్తున్నాడనగానే ఎవరైనా మరో సాఫ్ట్ మూవీ ఆశిస్తారు.

కానీ అడ్డాల మాత్రం చిన్నపాటి షాక్ ఇచ్చాడు. తన కొత్త సినిమాకు పెదకాపు-1 అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఈ సినిమాతో విరాట్ కర్ణ అనే కుర్రాడ్ని పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకు ఓ సామాన్యుడి సంతకం అనే ట్యాగ్ లైన్ పెట్టాడు. టైటిల్ తో పాటు, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇది పక్కా మాస్-యాక్షన్ మూవీలా కనిపిస్తోంది.

శ్రీకాంత్ అడ్డాల తన కెరీర్ లో చేసిన మాస్ సినిమా ఏదైనా ఉందంటే అది నారప్ప మాత్రమే. కాకపోతే అది రీమేక్ సినిమా. ఇక ముకుంద సినిమాలో యాక్షన్ కొద్దిగా ఉన్నప్పటికీ, మాస్ కనిపించదు. ఇలాంటి దర్శకుడు, ఇప్పుడు పెదకాపు-1 అంటూ మాస్-యాక్షన్ సినిమా ప్రకటించాడు.

అయితే పోస్టర్ లో మాస్-యాక్షన్ లుక్స్ కనిపించినప్పటికీ, శ్రీకాంత్ అడ్డాల మార్కులోనే సినిమా ఉంటుందని చెబుతున్నారు యూనిట్ జనం. ఈ సంగతి పక్కనపెడితే.. పెదకాపు అనే టైటిల్ వివాదాస్పదమయ్యే ప్రమాదం ఉందంటున్నారు మరికొంతమంది. ఏదేమైనా శ్రీకాంత్ అడ్డాల మాత్రం తన టైటిల్ తో అందర్నీ ఆకర్షించాడు.