కీలకమైన కొన్ని నియోజకవర్గాల విషయంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అడుగులు వేయడం ద్వారా గెలుచుకోగల అవకాశాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కాలదన్నుకుంటున్నట్లుగా ఉంది.
ఇప్పుడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీలోని గ్రూపు తగాదాలు రచ్చ కిక్కి చంద్రబాబు నాయుడు చేతగానితనాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గానికి, వలస వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను ఇన్చార్జిగా ప్రకటించే ముందు స్థానికంగా టికెట్ కోసం ఆశలు పెట్టుకుంటున్న నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధించలేకపోవడం అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు వైఫల్యమే!
ఆ వైఫల్యం ఇప్పుడు కోడెల శివరాం తిరుగుబాటుగా మారినట్టు కనిపిస్తోంది. తాను ఇండిపెండెంటు అభ్యర్థిగా అయినా పోటీచేసి తీరుతానని గెలిచి తీరుతానని కోడెల శివరాం ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించి, తన సత్తా ఏమిటో చంద్రబాబుకు చూపించడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
అలాగని కోడెల శివరాం- సత్తెనపల్లిలో తిరుగులేకుండా గెలిచేంతటి సత్తా ఉన్న నాయకుడా? అంటే అలాంటి పరిస్థితి కూడా లేదు. కానీ రంకెలు వేయడం మాత్రం దండిగా ఉంది.
నాయకత్వ లక్షణాలు, చేసిన సేవ లాంటి వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఒక మంచి డాక్టరుగా మంచి పేరు ప్రతిష్టలు ఉన్న కోడెల శివప్రసాద్ స్వయంగా సత్తెనపల్లిలో గెలవలేకపోయారు. ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించిన తర్వాత.. శివరాం ఇక తానే అభ్యర్థి అని తనంతట తానే నిర్ణయించుకున్నారు. ఇప్పుడిలా తన ఆశలకు కన్నా రూపంలో గండికొట్టేసరికి ఆయన సహించలేకపోతున్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే.. కోడెల కొడుకు అనే అర్హతతో మాత్రమే టికెట్ మీద ఆశపడుతూ.. స్థానికంగా అపకీర్తి కూడా ఉన్న శివరాం లాంటి నాయకుడిని బుజ్జగించడం కూడా చంద్రబాబుకు చేతకాలేదా? అని!! కన్నా ను అక్కడ ఇన్చార్జిగా ప్రకటిస్తున్నప్పుడు ముందుగానే.. అక్కడి వారికి నచ్చజెప్పి ఉండాల్సింది కదా అనేది అందరికీ కలుగుతున్న సందేహం.
తనకంటూ పెద్ద బలమూ బలగమూ లేని శివరాం కు కూడా సర్దిచెప్పలేకపోతే.. ముందుముందు జనసేనతో పొత్తుల ప్రహసనం కూడా కుదిరిన తర్వాత.. ప్రతి చోటా తలెత్తగల అసంతృప్తులను బుజ్జగించడం చంద్రబాబుకు ఎలా సాధ్యమవుతుంది? ఈ తలనొప్పులతో ఆయన అసలు పార్టీని ముందుకు తీసుకెళ్లగలరా? అనేది సందేహం.