ఆ సీఎం తో విశాఖ స్వామి

విశాఖకు చెందిన శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి తెలంగాణాలో మళ్లీ సందడి చేస్తున్నారు. అక్కడ శారదాపీఠానికి రెండు ఎకరాల స్థలంలో శ్రీ శారదాపీఠం ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం భూమిని ఇచ్చింది. ఈ పీఠంలో…

విశాఖకు చెందిన శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి తెలంగాణాలో మళ్లీ సందడి చేస్తున్నారు. అక్కడ శారదాపీఠానికి రెండు ఎకరాల స్థలంలో శ్రీ శారదాపీఠం ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం భూమిని ఇచ్చింది. ఈ పీఠంలో రాజమాత అమ్మ వారిని ప్రతిష్టింపచేస్తారు. నిత్య ఆరాధనలు పూజలు అక్కడ సాగుతాయి.

తాజాగా తెలంగాణా బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ తో కలసి స్వామి పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా స్వామికి కేసీయార్ పాదాభివందనం చేశారు. కార్యక్రమం అనంతరం స్వామి బస చేసిన ప్రాంతానికి కేసీఆర్ రావడం జరిగింది.

స్వామితో కేసీఆర్ చాలా సేపు మాట్లాడటం జరిగింది. ఇప్పటికి రెండు సార్లు తెలంగాణా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ ముచ్చటగా మూడవసారి గెలవాలని చూస్తోంది. గతంలో రాజ్యం కోసం రాజశ్యామల అమ్మ వారి యాగాలను కేసీఆర్ చేశారు. దానికి స్వామి నేతృత్వం వహించారు.

రాజశ్యామల అమ్మవారి మహిమ ఏంటి అన్నది కేసీఆర్ కే ఎక్కువగా తెలుసు అని స్వామి అంటున్నారు. తెలంగాణా గడ్డ మీద రాజశ్యామల అమ్మవారిని ప్రతిష్టించాలన్నది కేసీఆర్ కోరిక అని అందుకే అమ్మ వారి ఆలయ నిర్మాణం పనులు ప్రారంభించామని స్వామి చెప్పారు.

మరికొద్ది నెలలలో తెలంగాణాలో ఎన్నికలు ఉన్న వేళ స్వామి కేసీఆర్ కి నిండు దీవెనలు అందిస్తున్నారు. మరోసారి కేసీఆర్ గెలుస్తారని అంతా అంటున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు సన్నిహితుడిగా పేరు పొందిన స్వామికి  ఇటీవల కాలంలో వైసీపీ పెద్దలకు గ్యాప్ ఏర్పడింది అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో తెలంగాణా సీఎం తో స్వామి కనిపించడం, కేసీఆర్ మళ్లీ గెలవాలని కోరుకోవడం, రాజశ్యామల అమ్మ వారి దీవెలను ఆయనకు ఉన్నాయని చెప్పడం వైరల్ అవుతోంది.