అందరూ కొత్తవారే, పాతవాళ్లెవరికీ ఛాన్స్ లేదు అని జగన్ డిసైడ్ చేస్తే ఆ లెక్క వేరేలా ఉండేది. కానీ పార్టీ అవసరాల కోసం కొంతమందిని మారుస్తున్నాం. అలా మార్చినంత మాత్రాన వారెవరూ సరిగా పనిచేయనట్టు కాదు, మంత్రి పదవుల్ని పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. మళ్లీ గెలిస్తే మళ్లీ మీరే మంత్రులవుతారనే విషయం గుర్తుంచుకోండి అని హింటిచ్చి వదిలేశారు జగన్.
దీంతో కొంతమంది సీనియర్లకు పదవులు అలాగే ఉంటాయనే విషయం అర్థమవుతోంది. వాళ్లెవరు? పదవులు పోయేది ఎవరికి..? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ డిస్కషన్ గా మారింది. అన్నిటికీ ఈనెల 15న జరిగే వైసీఎల్పీ మీటింగ్ లో క్లారిటీ వచ్చే అవకాశముంది.
అంతా కొత్తవారన్నారు కదా..?
రెండేళ్ల తర్వాత మంత్రి వర్గంలో పూర్తిగా మార్పులుంటాయని ప్రమాణ స్వీకారం రోజే చెప్పేశారు సీఎం జగన్. ఆ మాట ప్రకారం రెండేళ్లవగానే ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త మంత్రి వర్గం ఎప్పుడు కొలువుదీరుతుంది, కొత్తగా ఎవరికి మంత్రి పదవులొస్తాయనే వార్తలు బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు నేరుగా జగన్ కేబినెట్ మీటింగ్ లో దీనిపై హింటివ్వడంతో మరో కొత్త చర్చ మొదలైంది.
కాంపిటీషన్ ఎక్కువ ఉంది, పార్టీ కోసం కొంతమంది, పదవుల్లో కొంతమంది అని చెప్పేశారు జగన్. దీంతో పదవుల్లో ఎవరా అనేది హాట్ టాపిక్ గా మారింది. పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స, బాలినేని, కొడాలి, పేర్ని నాని… ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వారంతా పదవుల్లో ఉంటారని, మిగతా వారంతా త్యాగాలు చేయాల్సి ఉంటుందని వార్తలొస్తున్నాయి.
అందులో ఏది నిజమో ఎంత నిజమో తెలియదు. దీంతో మంత్రులందరిలో టెన్షన్ మొదలైంది. కరోనా వల్ల మంత్రి పదవుల్లో ఉన్న ఫీలింగ్ చాలామందికి లేదు. అందులోనూ జగన్ హయాంలో మంత్రులకు పెద్ద ప్రాధాన్యత లేదనే విషయం కూడా తెలిసిందే. దీంతో ఎన్నికల వరకు పదవుల్లోనే ఉండాలని అనుకుంటున్నారంతా.
పదవి పోతే నియోజకవర్గాల్లో ఏమని చెప్పుకోవాలనే బాధ కూడా అందరిలో ఉంది. మంత్రి వర్గం మొత్తాన్ని మార్చేస్తే దిగులే లేదు. కొంతమందికి పదవులు ఉంచి, కొంతమందికి పార్టీ పేరు చెప్పి తీసేస్తే మాత్రం అలకలు, అసంతృప్తులు చెలరేగే ప్రమాదం ఉంది.
ఎన్నికల టీమ్ అది కాదు.. ఇది
కొత్త కేబినెట్ ను ఎన్నికల సన్నద్ధ టీమ్ గా భావించారు చాలామంది. కానీ జగన్ మాత్రం దానికి రివర్స్ లో ఆలోచించారు. మంత్రివర్గం నుంచి తొలిగించిన మంత్రులతో, జిల్లా స్థాయిల్లో ఎన్నికల టీమ్స్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే కనుక జరిగితే, జగన్ చెప్పినట్టు వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే.. జిల్లాల్లో ఎన్నికల టీమ్స్ లో కీలకంగా పనిచేసిన ఎమ్మెల్యేలంతా మరోసారి మంత్రులవుతారు.
కేబినెట్ లో ఉన్న మంత్రుల్ని కేవలం పరిపాలనకే పరిమితం చేసి, పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధం కోసం కొంతమంది కీలక వ్యక్తుల్ని మంత్రివర్గం నుంచి తప్పిస్తే మాత్రం ఎవ్వరికీ ఎలాంటి అలకలు-అసంతృప్తులు ఉండవు. ఈ మొత్తం వ్యవహారానికి 15తో ఇంటర్నల్ గా ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు.