బిగ్‌బాస్ రియాల్టీ షో ఫేం, గుజరాత్ బ్యూటీ మోనాల్ గజ్జర్ హైదరాబాద్‌కు మకాం మార్చనున్నారని సమాచారం. బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లక ముందు, అడపాదడపా మాత్రమే వెండితెరపై తళుక్కుమని మెరిసిన మోనాల్ ….తాజాగా ఎంతో పాపులర్ అయ్యారు.
వచ్చీ రాని తెలుగులో ముద్దుముద్దు మాటలు, అభిజిత్, అఖిల్‌తో ట్రయాంగిల్ లవ్, కంటెస్టెంట్లతో కౌగిలింతలు, కిస్‌లు …ఇలా మోనాల్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అనేక ఆసక్తికర విషయాలున్నాయి.
పెద్దగా అంచనా లేకుండానే హౌస్‌లోకి వెళ్లిన మోనాల్ గుజరాత్ ఆడబిడ్డ అయినప్పటికీ తెలుగు సమాజం ఆదరించింది. అందుకే ఆమె 14 వారాల పాటు హౌస్‌లో కొనసాగి ఔరా అనిపించారు.
బిగ్‌బాస్ దత్తపుత్రికగా ఆమె పేరు సంపాదించారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికొచ్చిన తర్వాత ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయంటున్నారు. తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినట్టు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో అవకాశాలే లేవనుకుంటున్న తరుణంలో టాలీవుడ్ పునర్జన్మ ఇచ్చిందనే భావన, నమ్మకం మోనాల్‌లో బలంగా ఏర్పడ్డాయి. దీంతో ఆమె గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చనున్నారనే సమాచారం.
ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఓ ప్లాట్ కూడా కొనుక్కోవాలని ఆమె ఆలోచిస్తున్నారని తెలిసింది. ఆదరించిన వాళ్లే మనోళ్లంటే ఇదే కదా మరి!