ఎన్నారై ప్రేమ అమరావతి కోసమా? కొత్త దందాల కోసమా?

చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే ఎడాపెడా యథోరీతిగా దండుకోవచ్చుననే ఆశ, అడ్డగోలుగా అవినీతికి పాల్పడవచ్చుననే కోరిక కేవలం స్థానికంగా రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ వారికి మాత్రమే కాదు.. విదేశాల్లో ఉన్న వారికి కూడా…

చంద్రబాబునాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే ఎడాపెడా యథోరీతిగా దండుకోవచ్చుననే ఆశ, అడ్డగోలుగా అవినీతికి పాల్పడవచ్చుననే కోరిక కేవలం స్థానికంగా రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీ వారికి మాత్రమే కాదు.. విదేశాల్లో ఉన్న వారికి కూడా ఉన్నాయి. 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అమెరికా అంతటా వసూళ్ల కార్యక్రమం జరుగుతుండగా.. గెలిచిన తర్వాత ఇస్తాం అంటూ అక్కడి సంపన్న ఎన్నారైలు చెబుతున్న మాటలు ఇలాంటి అభిప్రాయం కలిగిస్తున్నాయి.

అమెరికాలోని మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమం పేరు ఏదైనా దాని లక్ష్యం మాత్రం తెలుగుదేశం పార్టీకి విరాళాలు పోగు చేయడమే.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మనమంతా కలసి కట్టుగా కష్టపడాలని, ఒక సామాజిక వర్గానికి చెందిన వారంతా కలిసి ప్రతిజ్ఞలు చేయడమే. అదే క్రమంలో ఈ కార్యక్రమంలో కూడా విరాళాలు వెల్లువెత్తాయి. 

చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం, రాజధాని అభివృద్ధి చెందుతాయని, ఆదిశగా ప్రతి ప్రవాసాంధ్రుడు పనిచేయాలనే అభిలాషలు కూడా వ్యక్తం అయ్యాయి. వీరి ఆలోచనలలో ఇంకో అడుగు ముందుకు వేస్తూ.. ప్రవాసాంధ్ర డాక్టరు యడ్ల హేమప్రసాద్ అనే ఆయన ఇంకో హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమరావతిలో రాజధాని నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇస్తానని ఆయన ప్రకటించారు. ఆయన హామీ అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. 

తెలుగుదేశం పార్టీ  గెలుస్తుందో లేదో అనే భయం ఎన్నారైలలో ఉంది. ఇప్పుడు తమను విరాళాలకు ఒత్తిడి చేస్తున్న ఎన్నారై టీడీపీ ప్రతినిధుల బెడదను తప్పించుకునే ఉద్దేశం ఉంది. అందుకే గెలిచిన తర్వాత అమరావతికి రూ.కోటి ఇస్తా లాంటి భారీ వరాలుప్రకటించి మిన్నకుంటున్నారనేది ఒక అభిప్రాయం.

అమరావతి ప్రాంతంలో అనేక మంది ఎన్నారైలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టి.. వందల ఎకరాలను తమ కబ్జాలో పెట్టుకున్నారని, వీరందరూ కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కు సన్నిహితులు గనుక.. అమరావతి ప్రకటనకు ముందే అక్కడ పొలాలు కొని సంపదను పెంచుకున్నారని అందుకే ఇప్పుడు అమరావతి రాజధాని కోసం చంద్రబాబు గెలిచిన తరవాత విరాళాలు ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారనేది ఒక వాదన.

డాక్టర్ యడ్ల హేమప్రసాద్ లాంటి వారికి నిజాయితీ, చిత్తశుద్ధి, అమరావతిపై నిజమైన ప్రేమ ఉంటే గనుక.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా సరే.. అమరావతిలోనే ఏకైక రాజధానిని నిర్మించేట్లయితే తాను కోటిరూపాయల విరాళం ఇస్తాననే ప్రకటన చేయాలి. అలాకాకుండా.. ఇలాంటి మాటల ద్వారా.. చంద్రబాబు మళ్లీ సీఎం అయితే తాము సాగించుకోగల దందాలను  దృష్టిలో పెట్టుకునే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు.