నైటీ వేసుకున్నాడు.. పోలీసులకు దొరికిపోయాడు

సికింద్రాబాద్ లో జరిగిన సెల్ ఫోన్ షాపు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నైటీలో వచ్చింది అమ్మాయి అనుకున్నారు, కట్ చేస్తే, అతడు అమ్మాయి వేషంలో ఉన్న అబ్బాయి అని గుర్తించిన పోలీసులు.. ఆ…

సికింద్రాబాద్ లో జరిగిన సెల్ ఫోన్ షాపు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నైటీలో వచ్చింది అమ్మాయి అనుకున్నారు, కట్ చేస్తే, అతడు అమ్మాయి వేషంలో ఉన్న అబ్బాయి అని గుర్తించిన పోలీసులు.. ఆ వెంటనే చిటికెలో కేసును పరిష్కరించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

సికింద్రాబాద్ ఎస్డీ రోడ్ లో ఉన్న మొబైల్ షాపులో నైట్ వాచ్ మేన్ గా పనిచేస్తున్నాడు యాకయ్య. దుకాణంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదనే విషయాన్ని తెలుసుకున్నాడు. అనుకున్నదే తడవుగా షాపును దోచేయడానికి పథకం పన్నాడు. దీనికి రెండు మార్గాలు కనిబెట్టాడు. ఒకటి అబ్బాయిగా కాకుండా, అమ్మాయిగా మారడం.. రెండోది తనపై అనుమానం రాకుండా జాగ్రత్త పడడం.

అనుకున్నదే తడవుగా డ్యూటీకి శెలవు పెట్టాడు. తను ఊరు వెళ్తున్నానని, 2 రోజులు రానని చెప్పేశాడు. ఆ వెంటనే తన చెల్లెలు నైటీ వేసుకున్నాడు. ఎంచక్కా వెళ్లి షాపు షట్టర్ పగలగొట్టాడు. షాపులో ఉన్న మొబైల్స్ అన్నీ దోచేశాడు.

అట్నుంచి అటు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని తన ఇంటికి చేరుకున్నాడు. 8 లక్షల రూపాయల విలువైన సెల్  ఫోన్లను వేరే చోట దాచాడు. ఎవ్వరికీ దొరకలేదని ప్రశాంతంగా ఉన్నాడు.

పోలీసులకు ఎలా దొరికాడు..

సెల్ షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. షాపులో సీసీటీవీ ఫూటేజ్ లేకపోయినా, అదే మార్గంలో ఉన్న ఇతర సీసీటీవీ కెమెరాల విజువల్స్ తీసుకున్నారు. నైటీలో ఉన్న మహిళ నడిచే విధానం తేడాగా ఉందని గుర్తించారు. అదే టైమ్ లో చుట్టుపక్కలున్న వాచ్ మేన్ లను విచారించారు.

ఎంక్వయిరీలో భాగంగా యాకయ్య, హఠాత్తుగా 2 రోజులు శెలవు పెట్టిన విషయాన్ని గమనించారు. అతడి వ్యవహారశైలి  అనుమానాస్పదంగా తోచింది పోలీసులకు. ఎందుకైనా మంచిదని అతడి ఊరికి ఓ టీమ్ ను పంపించారు. యాకయ్య ఇంటికి వెళ్లిన పోలీసులకు అసలు మేటర్ అర్థమైంది. యాకయ్యను అదుపులోకి తీసుకున్నారు, అతడు దొంగిలించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.